పార్టీ బలోపేతం దిశగా కేటీఆర్: ఇక జిల్లా పర్యటనలు

By narsimha lodeFirst Published Dec 17, 2018, 6:06 PM IST
Highlights

పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసే కార్యక్రమానికి  కేటీఆర్ శ్రీకారం చుట్టారు

వరంగల్: పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసే కార్యక్రమానికి  కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో  కేటీఆర్  వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేటీఆర్  వరంగల్, జనగామ జిల్లాల్లో పర్యటించనున్నందున టీఆర్ఎస్ నేతలు  విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

 ఈ నెల 20వ తేదీన వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామా జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు.  ఈ రెండు జిల్లాల్లో పార్టీని పటిష్టం చేసే కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 

ఈ నెల 20వ తేదీన ఉదయం 11 గంటలకు జనగామ జిల్లాలోని ప్రిస్టన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసే పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, జనగామ నియోజక వర్గాల కార్యకర్తల సమావేశంలో కేటిఆర్ పాల్గొంటారు.  రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీని  బూత్‌స్థాయిలో బలోపేతం చేసే దిశగా కేటీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు. ఈ విషయమై ఆయా జిల్లాలోని పార్టీ నేతలతో  కేటీఆర్  చర్చిస్తారు.

తెలంగాణ ఉద్యమానికి పట్టుగొమ్మగా నిలిచి ఉన్న వరంగల్ జిల్లా నుండి  పర్యటనకు కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ఆ జిల్లా నేతలు భావిస్తున్నారు. 

కేటీఆర్ పర్యటనను పురస్కరించుకొని  ఏర్పాట్లపై మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, స్టేషన్‌‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్,నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాజయ్య యాదవ్, వికలాంగుల కార్పోరేషన్ వాసుదేవరెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో పెంబర్తి కాకతీయ కళాతోరణం నుంచి ప్రిస్టన్ గ్రౌండ్స్ వరకు వేలాదిగా పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. వరంగల్ పర్యటన తర్వాత కేటీఆర్ ఇతర జిల్లాల్లో కూడ పర్యటించాలని భావిస్తున్నారు. 


 

click me!