కేటీఆర్ సార్... నన్నూ, నా కుటుంబాన్ని ఆదుకోండి: చావుతో పోరాడుతూ అభ్యర్థించిన రైతు (వీడియో)

By Arun Kumar PFirst Published Jun 6, 2020, 8:13 PM IST
Highlights

ఆరుగాలాలు కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే కొనే దిక్కులేక ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇలాకాలో చోటుచేసుకుంది. 

సిరిసిల్ల: ఆరుగాలాలు కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే కొనే దిక్కులేక ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇలాకాలో చోటుచేసుకుంది. అయితే సదరు రైతు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. తనను, తన  కుటుంబాన్ని ఆదుకోండంటూ అతడు మంత్రి కేటీఆర్‌ను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మిల్లర్ల వద్దకు తీసుకుని పోతే, వడ్లు పాడైనాయని కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ రైతుల బాధ ఎవరికీ రావొద్దని... నేనీలోకం నుంచి వెళ్లిపోతున్నానని వీడియోలో పేర్కొన్నాడు. 

"

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లికి చెందిన గుడి మహిపాల్ రెడ్డి ధాన్యం కొనడం లేదంటూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

ఎల్లారెడ్డిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత రైతు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ధాన్యం సేకరణలో చివరి నిర్ణయం మిల్లర్లదే కావడంతో ఈ దుస్థితి వచ్చిందని.... దీనివల్లే చాలా చోట్ల రైతులు తమ ధాన్యాన్ని దగ్దం చేయడం, ధర్నాలు చేయడం వంటి నిరసనలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయిందని... ప్రస్తుతం రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని వివరించాడు. 

"

పంట అమ్ముకుని చేతికొచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలు తీర్చుకుని, మరోసారి పంట వేసేందుకు సమాయత్తం కావల్సిన ఈ సమయంలో కూడా రైతులు ధాన్యం కొనండి మొర్రో అంటూ అడుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. చివరకు ఓ రైతు బలవణ్మరనానికి పాల్పడుతున్నారంటే రైతులు ఎలాంటి దయనీయమైన స్థితిలో ఉన్నారో ప్రభుత్వాలు, నాయకులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలంటూ వివరించాడు. 

click me!