గడ్డం తీస్తారో తీయరో: ఉత్తమ్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

By narsimha lodeFirst Published Dec 20, 2018, 2:41 PM IST
Highlights

 ప్రజలిచ్చిన తీర్పుతో  కాంగ్రెస్ పార్టీ నేతలు  లేచే పరిస్థితే లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  ఎద్దేవా చేశారు.


జనగామ: ప్రజలిచ్చిన తీర్పుతో  కాంగ్రెస్ పార్టీ నేతలు  లేచే పరిస్థితే లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. గడ్డాలు తీయాలో వద్దో అని కొందరు నేతలు  ఆలోచిస్తున్నారని పరోక్షంగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రంలో ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ నిర్ణయించనుందన్నారు.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా  బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జనగామ జిల్లాలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తాను కార్యకర్తగా ఉండాలనేది కేసీఆర్ ఆదేశమని చెప్పారు. రానున్న ఏడు మాసాల్లో కార్యకర్తలు, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అహర్నిశలు పనిచేయాలని  ఆయన కోరారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  ఎవరెన్ని మాటలు చెప్పినా కూడ ప్రజలు నమ్మలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితే లేదన్నారు. ప్రజలు కొట్టిన దెబ్బకు  కాంగ్రెస్ పార్టీ చతికిలపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే గడ్డం తీయనని శపథం చేసిన వాళ్లు గడ్డలు తీయాలో వద్దో అని ఆలోచిస్తూ తలలు పట్టుకొన్నారని పరోక్షంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో  16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంటే కేంద్రంలో  ఏర్పడే ప్రభుత్వాన్ని కూడ టీఆర్ఎస్ శాసించే పరిస్థితి ఉంటుందని చెప్పారు. కేంద్రంలో టీఆర్ఎస్ చెప్పినట్టు  నడిచే  ప్రభుత్వం ఉంటే  తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు.

చావు నోట్లో తల పెట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కేటీఆర్ గుర్తు చేశారు. టీఆర్ఎస్‌ పుట్టుకే ఓ చరిత్ర అని  ఆయన చెప్పారు. కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి దిక్సూచి అని ఆయన చెప్పారు కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించారని చెప్పారు.కేంద్రం మెడలు వంచి కేసీఆర్ తెలంగాణను సాధించారని చెప్పారు.

కేసీఆర్‌ను ఆశీర్వదించేందుకు ఓటింగ్ శాతం పెరిగిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోరాటంలో వరంగల్ జిల్లాది అద్వితీయ చరిత్రగా కేటీఆర్ గుర్తు చేశారు.

త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, సింగిల్‌విండో ఎన్నికలు రానున్నాయని  ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో  బలమైన నాయకత్వాన్ని  పార్టీలో తీసుకురావాల్సిన అవసరం ఉందని కేటీఆర్ చెప్పారు.

రానున్న ఆరు మాసాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను  నిర్మించుకొంటామని ఆయన చెప్పారు. పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయం సాధించగానే అహంతో ప్రజలను విస్మరిస్తే నష్టం జరుగుతోందన్నారు.  ఎన్ని దఫాలు విజయం సాధించినా  కూడ ప్రజల కోసం పనిచేయాలని  కేటీఆర్ కోరారు.

click me!