పవన్, జగన్ లను అందుకే వదిలేశాం: కేటీఆర్

By pratap reddyFirst Published Oct 13, 2018, 9:40 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముందు పెట్టి తోలు బొమ్మలాట ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. 

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తాము ఎందుకు విమర్శించడం లేదో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కెటి రామారావు వివరించారు. వారిద్దరు తెలంగాణలో వేలు పెట్టడం లేదని, వారి పనేదో వారు చేసుకుంటూ పోతున్నారని అందుకే వారిని విమర్శించడం లేదని ఆయన అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముందు పెట్టి తోలు బొమ్మలాట ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను, రాష్ట్ర అభివృద్ధిని చూసి కాంగ్రెస్ సహించలేకపోతోందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేసి ఆపినందువల్లనే ప్రజాకోర్టులో కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకు ఎన్నికలకు వెళ్తున్నామని ఆయన చెప్పారు. 

గత నాలుగేళ్లలో తాము సాధించిన అభివృద్ధి ఎజెండాగా ఈ ఎన్నికలు ఉంటాయని, ఈ ఎన్నికలు తమ పార్టీ పనితీరుకి రెఫరెండమని కేటీఆర్ అన్నారు. గత నాలుగేళ్లుగా ఎన్నిక తర్వాత ఎన్నికకు తమ పార్టీకి పెరిగిన ప్రజాదరణను చూసి కాంగ్రెస్ భయపడుతోందని అన్నారు.వేములవాడ నియోజకవర్గానికి చెందిన బిజెపి, కాంగ్రెసు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు శనివారం టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

గత నాలుగేళ్లుగా తెలంగాణకు అనేక విధాలుగా అన్యాయం చేసిన బిజెపిని కూడా ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా అమిత్ షా పాత చింతకాయ పచ్చడి లాంటి సత్యదూరమైన విమర్శలు చేస్తున్నారని తప్పు పట్టారు. తాము ఢిల్లీ బాసులకు భయపడేది లేదని, తమ అధిష్టానం ఎన్నటికీ తెలంగాణ ప్రజలేనని అన్నారు. 

click me!