ఏపీ రాజధాని వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Jan 17, 2020, 3:59 PM IST
Highlights

ఏపీ రాజధాని మార్పుపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ రాజధాని మార్పుపై ఆందోళనలు చెలరేగడంపై ఆయన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు వివాదంపై తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదనపై ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురువుతున్న విషయం తెలిసిందే. రాజధాని తరలిపోతుందనే ఉద్దేశంతో అమరావతిలో ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. 

ఏపీ రాజధాని విషయంలో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో కేటీఆర్ దానిపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజన చేశామని, కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రంలో ఏ విధమైన వ్యతిరేకత రాలేదని ఆయన చెప్పారు. 

కానీ రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకత వస్తుందని, అలా ఎందుకు జరుగుతుందనేది ఆలోచించాల్సిన విషయమని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఏపి రాజధాని అమరావతిపై కూడా ఆయన మాట్లాడారు. 

ఏపీలో మూడు రాజధానులు ఏర్పడవచ్చునని వైఎస్ జగన్ ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా విమర్శలు, ఆందోళనలు ముందుకు వచ్చాయని ఆయన అన్నారు. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారని ఆయన చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పడ్డాయని, ఎక్కడా చిన్న సంఘటన జరగకుండా కేసీఆర్ విజయవంతంగా పరిపాలన చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అందరినీ ఒప్పించి, మెప్పిస్తున్నారని ఆయన అన్నారు. 

రాజధానిని తరలించకూడదని డిమాండ్ చేస్తూ అమరావతిలో ఆందోళనలు ప్రారంభమైన నెల దాటుతోంది. తెలుగుదేశం వారికి ముందు వరుసలో నిలబడి మద్దతు ఇస్తోంది. టీడీపీ అధ్యక్షుడు సతీసమేతంగా అమరావతి వెళ్లి వారికి మద్దతు ఇస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.

click me!