పేచీ పెట్టే కుట్ర అది: విపక్షాలపై ధ్వజమెత్తిన కేటీఆర్

First Published May 14, 2018, 5:11 PM IST
Highlights

కౌలు రైతులకు, భూ యజమానులకు మధ్య పేచీ పెట్టేందుకు ప్రతిపక్షాల నాయకులు ప్రయత్నిస్తున్నారని మంత్రి కెటి రామారావు విమర్శించారు.

మహబూబ్‌నగర్: కౌలు రైతులకు, భూ యజమానులకు మధ్య పేచీ పెట్టేందుకు ప్రతిపక్షాల నాయకులు ప్రయత్నిస్తున్నారని మంత్రి కెటి రామారావు విమర్శించారు. కౌలుదారులకు రైతుబంధు డబ్బులను భూ యజమానులే ఇస్తే బాగుంటుందని అన్నారు. 

సోమవారం భూత్పూర్‌లో రైతుబంధు పథకానికి సంబంధించిన చెక్కులను, పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. పాలమూరులో నాలుగేళ్లలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరందించామని కేటీఆర్ చెప్పారు. 

కరివేన రిజర్వాయర్ పూర్తయితే భూత్పూర్‌లో 60వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, పంటల మద్దతుధర 25 శాతం పెంచాలని తాము కేంద్రాన్నికోరినట్లు తెలిపారు. 

తమ పూర్వీకులు కూడా భూనిర్వాసితులేనని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెసు నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే అరుణలకు సంబంధించిన భూములు ఎక్కడా పోలేదని అన్నారు. రైతుబంధు పథకంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల నేతలు దమ్ముంటే రైతుబంధు పథకాన్ని వద్దని చెప్పాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

click me!