ఈ 24 సీట్లే కీలకం: కేటిఆర్ పై భారం వేసిన కేసీఆర్

By pratap reddyFirst Published Oct 12, 2018, 5:06 PM IST
Highlights

హైదరాబాదులో కేటీఆర్ తో పాటు కేసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత కూడా ప్రచారం చేయనున్నారు. హైదరాబాదులోని కొన్ని సీట్లకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 

హైదరాబాద్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) పరిధిలోని సీట్లే కీలకం కానున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో 24 శాసనసభా నియోజకవర్గాలున్నాయి. ఈ 24 సీట్లలో కనీసం 15 సీట్లలో విజయం సాధించాలనేది తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ బాధ్యతను తన తనయుడు కేటీఆర్ కు అప్పగించారు.

హైదరాబాదులో కేటీఆర్ తో పాటు కేసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత కూడా ప్రచారం చేయనున్నారు. హైదరాబాదులోని కొన్ని సీట్లకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 2016లో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల బాధ్యతను కేసిఆర్ కేటీఆర్ కు అప్పగించారు. ఆ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 100 డివిజన్లను గెలుచుకుని టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించింది.

దాంతో కేటిఆర్ పై కేసిఆర్ కు విశ్వాసం పెరిగింది. దాంతో జిహెచ్ఎంసి పరిధిలోని శాసనసభా స్థానాలను గెలిపించే బాధ్యతను కేటిఆర్ కు అప్పగించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆంధ్ర సెటిలర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అయితే, వారు సెటిలర్లు కారని, తెలంగాణలో నివసించేవారంతా తెలంగాణవాళ్లేనని కేటిఆర్ సమయం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. 

గత శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 3 సీట్లు మాత్రమే గెలిచింది. జిహెచ్ఎంసి పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది. అయితే, టీడీపి నుంచి గెలిచిన పలువురు శాసనసభ్యులు టీఆర్ఎస్ లో చేరిపోయారు. తద్వారా టీఆర్ఎస్ బలం పెరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. 

ఇదిలావుంటే, కాంగ్రెసుతో టీడీపి పొత్తు పెట్టుకోవడాన్ని సెటిలర్లు ఇష్టపడడం లేదని, రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెసు పార్టీయే కాబట్టి వారు పొత్తును వ్యతిరేకిస్తున్నారని టీఆర్ఎస్ వాదిస్తోంది. దానివల్ల తమకు లాభం చేకూరుతుందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఈ స్థితిలో అవసరమైతే కేసిఆర్ కూడా హైదరాబాదులో ప్రచారం చేయవచ్చునని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రచారం చేస్తారా, లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

click me!