కరోనా కట్టడిపై తమ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తెలంగాణ మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. మంత్రి ఈటెల రాజేందర్, వైద్యాధికారులు రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతున్నారని ఆయన అన్నారు.
మహబూబ్ నగర్: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే ప్రతిపక్షాల విమర్శలను తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తిప్పికొట్టారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వైద్యాధికారులు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతున్నారని ఆయన చెప్పారు. కరోనా కట్టడికి వారు చేస్తున్న కృషిని తెలియజేస్తూ ఆయన ఆ విధంగా అన్నారు.
మహబూబ్ నగర్ లో కొత్తగా నిర్మించిన ప్రబుత్వ విద్య కళాశాలను మంత్రులు ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి ఆయన సోమవారంనాడు ప్రారంభించారు. కరోనా నివారణ అనేది కేవలం ప్రభుత్వ సంబంధమైన విషయం మాత్రమే కాదని కేటీఆర్ అన్నారు. కరోనాపై కూడా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విరుచుకుపడ్డారు.
undefined
కరోనా కేసుల విషయంలో భారత్ మూడో స్థానంలో ఉందని, ఇది ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యంగా భావించాలా అని ఆయన అన్నారు. ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుందని ఆయన గుర్తు చేశారు. ప్రాణాలకు ఎదురొడ్డి కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన వల్లనే ఐదు జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకోగలిగామని ఆయన చెప్పారు. కేసీఆర్ కిట్ల వల్ల ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని, మాతాశిశు మరణాల సంఖ్య తగ్గిందని ఆయన చెప్పారు. కంటి వెలుగు పథకం కింద గ్రామాల్లో కోట్ల మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
కరోనా రోగులకు చికిత్స చేయడానికి ప్రైవేట్ ఆస్పత్రులు భయపడుతూ వారిని వెళ్లగొడుతున్నాయని, ప్రభుత్వాస్పత్రులు మాత్రమే చికిత్స అందిస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. కుటుంబ సభ్యులు కూడా కరోనా రోగి వద్దకు వెళ్లడానికి భయపడుతున్నారని, ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రభుత్వ సిబ్బంది చికిత్స అందిస్తున్నారని ఆయన అన్నారు.
కరోనా రోగులను వెలి వేసినట్లు చూడడం సరి కాదని ఆయన అన్నారు. కరోనా ధనిక, పేద తేడాలు లేవని, ఎవరికైనా రావచ్చునని ఆయన అ్నారు. రెండు మరణాలను చూపించి, 98 శాతం రికవరీలను చిన్నదిగా చూపవద్దని ఆయన అన్నారు. భారత్ లో తయారైన మందులు ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయని ఆయన చెప్పారు.