ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విషయంలో చోటుచేసుకున్న అపోహలపై విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమీక్షించారని, ఈ అపోహలను తొలగించడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భరోసా ఇచ్చారు. ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహార శైలిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. మార్కుల జాబితాల్లో తప్పుల తడకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విషయంలో చోటుచేసుకున్న అపోహలపై విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమీక్షించారని, ఈ అపోహలను తొలగించడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. సత్వరమే దర్యాప్తు జరిపి మూడు రోజులలో ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుందని చెప్పారు.
ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళన చెందవద్దని కోరారు. ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ లకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.. ఏ ఒక్క విద్యార్ధికి కూడా నష్టం జరగకుండా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ అన్నారు.
ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎటువంటి పొరపాటు జరిగినా సరిదిద్దుతామన్నారు. ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.