kaleshwaram project issue: కేసీఆర్‌, హ‌రీష్‌ల‌కు నోటీసుల‌పై స్పందించిన కేటీఆర్‌, క‌విత‌.. ఏమ‌న్నారంటే.

Published : May 22, 2025, 04:25 PM IST
KCR And Harish Rao

సారాంశం

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడీ అంశం తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా ఈ చ‌ర్య‌ను బీఆర్ఎస్ నాయ‌కులు తీవ్రంగా ఖండిస్తున్నారు. 

కేసీఆర్‌తో పాటు హ‌రీష్ రావుకు నోటీసులు అందించ‌డాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపుకు దిగుతున్నదని ఆయన ఆరోపించారు. ఇది కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న ఒక రాజకీయ నాటకం అని అన్నారు. ప్రజల దృష్టిని తప్పుదారి పట్టించేందుకు ఈ నోటీసులు జారీ చేశారని విమర్శించారు. "ఇది ఒక రాజకీయ డ్రామా. మేము భయపడే అవసరం లేదు" అని స్పష్టంగా చెప్పారు.

గత 17 నెలలుగా పాలనలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు నోటీసులు, కమిషన్ల పేరుతో ప్రజలను మోసగిస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాపాలన కనుమరుగై, కమీషన్ల ఆధిపత్యం పెరిగిపోయిందని ఆరోపించారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ విషాదం, సుంకిశాల ప్రాజెక్టు కుప్పకూలిన ఘటనలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "కమీషన్లపై ఆసక్తి చూపిన విధంగా, బాధితుల మీద కనీసం జాలిని చూపలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది" అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

చట్టపరంగా తమకు పూర్తి నమ్మకం ఉందని, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుందన్న విశ్వాసం తమకు ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నోటీసులు తాత్కాలికమైన రాజకీయ ప్రయత్నాలు మాత్రమేనని, ప్రజలు అసలు వాస్తవాలు తెలుసుకుంటున్నారని తెలిపారు.

అది కాళేశ్వ‌రం క‌మిష‌న్ కాదు... కాంగ్రెస్ క‌మిష‌న్‌:

కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వ‌డంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత స్పందించారు. ఈ విష‌య‌మై ఎక్స్ వేదిక‌గా ఆమె ఒక పోస్ట్ చేశారు. ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన‌ ప్రజానాయకుడు కేసీఆర్‌ని రాజ‌కీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వ‌రం క‌మిష‌న్ నోటీసులు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అది కాళేశ్వ‌రం క‌మిష‌న్ కాదు... కాంగ్రెస్ క‌మిష‌న్ అని మ‌రోసారి తేట‌తెల్ల‌మైంది.

 

 

కాళేశ్వరం ప్రజా ప్ర‌యోజ‌నాల‌ కోసం నిర్మించిన‌ బృహత్ ప్రాజెక్టు. తెలంగాణ ప్రజల తరతరాల దాహార్తిని తీర్చడానికి, తెలంగాణ పొలాల్లోకి గోదావరి నీళ్లను గళగళా తరలించడానికి కట్టిన ప్రాజెక్టు. తాను కలలు గన్న తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్‌ గారు కట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం. రాజకీయ కక్షతో, కుట్రతో ఇచ్చిన ఈ నోటీసులు, వేసిన కమిషన్లు కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్ని గెలిపిస్తాయి. నిజాలన్నీ బయటకు వస్తాయని, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటూ రాసుకొచ్చారు.

హ‌రీష్ రావు, కేసీఆర్ భేటీ:

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు కలిశారు. కాళేశ్వరం కమిషన్‌ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. వచ్చే నెల 5న విచారణకు రావాలని కేసీఆర్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ విష‌యంపై వీరిద్ద‌రూ చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Interview: ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu