టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికలను రేవంత్ రెడ్డి ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికలను రేవంత్ రెడ్డి ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలను డబ్బు సంపాదించడానికి ఉపయోగించుకుంటున్నాడని ఆరోపణలు చేశారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బిల్యా నాయక్ తన మద్దతుదారులతో కలిసి బుధవారం రోజున బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో ఓటుకు నోటు కుంభకోణంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సీటుకు నోటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో గెలుస్తామంటూ బూటకపు సర్వేలతో ప్రజల్లో, ఓటర్లలో గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేసిందని.. అయితే ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు. కేసీఆర్‌ను ఓడించేవరకు గడ్డం తీయనని 2018 ఎన్నికలకు ముందు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎలా ప్రతిజ్ఞ చేశారో అందరికి తెలిసిందేనని అన్నారు.
60 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్.. 24 గంటల కరెంటు ఇవ్వలేక పోయిందని, ఇంటింటికీ తాగునీటి సౌకర్యం కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్.. ఇప్పుడు ప్రజలను ఎలా ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. ఒక్క చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నారని.. ఆ పార్టీకి మద్దతిచ్చి మన వేలితో మన కంటిని పొడుచుకుందామా? ఆలోచించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ హయాంలో కనిపించే విద్యుత్ కోతలు, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలను ప్రజలు కోరుకోవడం లేదని అన్నారు. కేసీఆర్‌కు మరోమారు ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
అదే సమయంలో బీజేపీపై కేటీఆర్ మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంటుకు ఇచ్చిన సమాచారంపైన కూడా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.