ఆపరేషన్ హుజురాబాద్: ఈటలపై కౌశిక్ రెడ్డి అస్త్రం, కేటీఆర్ తో మంతనాలు

By telugu teamFirst Published Jun 12, 2021, 7:15 AM IST
Highlights

కాంగ్రెసు హుజురాబాద్ ఇంచార్జీ కౌశిక్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాదులో ఈటల రాజేందర్ మీద కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ పోటీకి దింపే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది.

హైదరాబాద్: హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యర్థిని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నిర్ణయించినట్లు అర్థమవుతోంది. కాంగ్రెసు హుజూరాబాద్ నియోజకవర్గం ఇంచార్జీ కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ నుంచి పోటీకి దించే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. శుక్రవారం హైదరాబాదులో జరిగిన ఓ దశదిన కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి మంత్రి కేటీఆర్ ను కలిశారు. 

ఒకే టేబుల్ మీద వారు భోజనం చేయడమే కాకుండా మాటాముచ్చట సాగించారు. కేటీఆర్ కారు ఎక్కే ముందు కూడా కౌశిక్ రెడ్డి ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. కౌశిక్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వరుసకు సోదరుడు అవుతాడు. దాంతో కూడా ఆ సన్నివేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన సందర్భంలో ఆయనకు కాంగ్రెసు నేతలు మద్దతుగా నిలిచారు. కానీ, కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. 

టీవీ చానెల్ డిబెట్ లో కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఏదో తేడా కొడుతున్నట్లు అనిపించింది. రాజేందర్ ను నైతికంగా దెబ్బ తీయడానికి కౌశిక్ రెడ్డి అస్త్రంగా వాడినట్లు అర్థమవుతోందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి కాంగ్రెసు తరఫున పోటీ చేసి ఈటల రాజేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు.  
కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి ఏకాంతంగా మాట్లాడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరి, రాజేందర్ ను ఎదుర్కుంటారని ప్రచారం సాగుతోంది. అయితే, ఆ వార్తలను కౌశిక్ రెడ్డి తోసిపుచ్చారు. మర్యాదపూర్వకంగా మాత్రమే తాను కేటీఆర్ ను కలిసినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 

హుజూరాబాదులో ఎవరిని పోటీకి దించాలనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది. గతంలో ఈటల రాజేందర్ మీద పోటీ చేసి ఓడిపోయిన వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ మంత్రి, ప్రస్తుత బిజెపి నేత ఇనుగాల పెద్దిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కెప్టెన్ లక్ష్మీకాంత రావు కుటుంబం నుంచి ఒక్కరిని పోటీకి దించితే ఎలా ఉంటందనే ఆలోచన కూడా సాగుతోంది. తాజాగా పాడి కౌశిక్ రెడ్డి పేరు ముందుకు వచ్చింది.2018 ఎన్నికల్లో ఈటల మీద కౌశిక్ రెడ్డి 40 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 

click me!