కౌశిక్ రెడ్డిపై బహిష్కరణ వేటు: ఇంటి దొంగలను వదిలేది లేదన్న రేవంత్ రెడ్డి

By telugu teamFirst Published Jul 12, 2021, 5:50 PM IST
Highlights

కౌశిక్ రెడ్డి ఓవైపు పార్టీకి రాజీనామా చేయగా, ఆయనను తెలంగాణ పీసీసీ పార్టీ నుంచి బహిష్కరించింది. కాగా, ఇంటి దొంగలను వదిలేది లేదంటూ రేవంత్ రెడ్డి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.

హైదరాబాద్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై పార్టీ హుజురాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెసు బహిష్కరణ వేటు వేసింది. టీఆర్ఎస్ తో కుమ్మక్కయి కౌశిక్ రెడ్డి కోవర్టుగా మారాడాని పీసీసీ అభిప్రాయపడింది. కాగా, కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కాంగ్రెసు కమిటీ తీర్మానం చేసింది. 

ఇదే సమయంలో పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించే నేతలకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రమైన హెచ్చరికలు చేశారు. ఇంటి దొంగలను విడిచి పెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. ఇంటి దొంగలు ఎవరైనా ఉంటే పరార్ కావాలని, లేదంటే బుద్ధి తెచ్చుకుని మసలుకోవాలని ఆయన అన్నారు. నెలాఖరు వరకు ఇంటి దొంగలకు సమయం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీలో కష్టపడోడుంటే వదులుకునేది లేదని, దగ్గర పెట్టుకుని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని ఆయన చెప్పారు. 

కాగా, హుజురాబాద్ లో గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. త‌న‌కు టీఆర్ఎస్ టికెట్ వ‌చ్చింద‌ని, కొంత‌మంది నేత‌ల‌కు ఫోన్ లో కౌశిక్ రెడ్డి సాగించిన బేర‌సారాలు బ‌య‌ట‌కు పొక్క‌టంతో కాంగ్రెస్ క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం సీరియ‌స్ అయ్యింది. 24గంట‌ల్లో సంజాయిషీ ఇవ్వాల‌ని... స‌రైన స‌మాధానం రాక‌పోతే పార్టీ నుండి బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రించింది. 

గ‌తంలోనే మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి మంత‌నాలు సాగించిన ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చినా... తాను కాంగ్రెస్ లోనే ఉంటాన‌ని కౌశిక్ రెడ్డి ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడు ఏకంగా త‌న ఆడియో కాల్ బ‌య‌ట‌కు రావ‌టంతో ఆయ‌న పార్టీకి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి... మాజీ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి త‌మ్ముడు.

click me!