Konijeti Rosaiah Last rites: రేపు కొంపల్లిలో రోశయ్య అంత్యక్రియలు.. ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాట్లకు ఆదేశం..

By team teluguFirst Published Dec 4, 2021, 4:59 PM IST
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Konijeti Rosaiah) అంత్యక్రియలు రేపు (ఆదివారం) హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలో జరగనున్నాయి. రోశయ్య అంత్యక్రియలను (Rosaiah last rites) ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Konijeti Rosaiah) అంత్యక్రియలు రేపు (ఆదివారం) హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలో జరగనున్నాయి. కొంపల్లిలోని రోశయ్య ఫామ్‌హౌస్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రోశయ్య అంత్యక్రియలను (Rosaiah last rites) ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రోశయ్య మృతిపట్ల  మూడు రోజులు సంతాప దినాలుగా పాటించనున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 

ప్రజల సందర్శనార్ధం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం..
ఆదివారం ఉదయం వరకు రోశయ్య భౌతికకాయం (Rosaiah mortal) ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. రేపు ఉదయం శాస్త్రోక్తమైన కార్యక్రమాల అనంతరం ఆయన భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు (Gandhi Bhavan) తరలిస్తారు. ప్రజల సందర్శనార్ధం మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల వరకు రోశయ్య భౌతికకాయాన్ని గాంధీభవన్‌లో ఉంచనున్నారు. అనంతరం గాంధీభవన్‌ నుంచి కొంపల్లి ఫామ్‌హౌస్ వరకు.. రోశయ్య అంతిమ యాత్ర సాగుతుంది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటల ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. 

అయితే తొలుత రోశయ్య అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో జరగనున్నట్టుగా కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచందర్‌రావు తెలిపారు. అయితే ఆ తర్వాత కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించాలనే నిర్ణయానికి కుటుంబ సభ్యులు వచ్చినట్టుగా తెలిసింది.

Also read: Konijeti Rosaiah Death: రోశయ్య పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళి..


సంతాపం తెలిపిన ప్రముఖులు.. 
రోశయ్య శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్న్ తమిళిసై సౌందర్ రాజన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, తమిళనాడు గవర్నర్  ఆర్ఎన్ ర‌వి, సీఎం ఎంకే స్టాలిన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ సాకె శైలజనాథ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. తెలంగాణ, ఏపీలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. 

రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి..
తెలంగాణ సీఎం కేసీఆర్ రోశయ్య నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. రోశయ్య పార్థివదేహం వద్ద పుష్పగుచ్చంఉంచి నివాళులర్పించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలో ఉన్న తమ ఫామ్ హౌస్ లో రేపు అంత్యక్రియలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ కు రోశయ్య కుటుంబసభ్యులు తెలిపారు. సీఎం కేసీఆర్‌తో వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అమీర్‌పేటలోని రోశయ్య ఇంటికి చేరుకుని.. ఆయన పార్థివదేహానికి నివాళులర్పిస్తున్నారు.

click me!