కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Jan 21, 2023, 2:00 PM IST
Highlights

కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరం కలిసి పనిచేయలేకే ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు.

కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరం కలిసి పనిచేయలేకే ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. ఇప్పటికైనా అందరం కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులను కోరారు. శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయాన్ని ప్రస్తావించారు. పార్టీకి నష్టం చేకూర్చేలా చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్  చేయాలని కోరినట్టుగా తెలుస్తోంది. 

అయితే సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈ సమావేశంలో వ్యక్తిగత  అంశాలు మాట్లాడొద్దని సూచించారు. సమావేశ అజెండా మీదే ఇక్కడ మాట్లాడాలని కోరారు. వ్యక్తిగత అంశాలు, డిమాండ్లు, ఏదైనా ఫిర్యాదులు ఉంటే.. పార్టీ ఇంచార్జ్‌ను కలిసి చెప్పొచ్చని అన్నారు. 

అయితే చాలా కాలంగా కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం గాంధీ భవన్‌కు వచ్చారు. అక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల సమావేశంతో టీ కాంగ్రెస్‌లో పరిణామాలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కొండా సురేఖ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని అనడం తీవ్ర దుమారం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

click me!