
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి.. కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్ అని అన్నారు. తాను చనిపోయే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు. తాను పార్టీ పదవిని మాత్రమే ఆశించానని.. మంత్రి, సీఎం పదవులు ఆశించలేదని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు సర్వే చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్లను ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
అయితే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొంటారా? లేదా? అనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేకుండా పోయింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనకుండా.. ఆయన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లనున్నారనే ప్రచారం సాగుతుంది. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
అయితే సొంత పార్టీ నేతలనే తనను దూషించడం జీర్ణించుకోలేకపోతున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు. ఆత్మ ప్రబోధానుసారం తాను మునుగోడులో ప్రచారానికి వెళ్లాలా? లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకొంటానని చెప్పారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతలు క్షమాపణలు చెప్పడంపై కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మెలిక పెట్టారు. తాను ప్రచారానికి వెళ్తే మళ్లీ తనపై సొంత పార్టీ నేతలే ఏ విధమైన వ్యాఖ్యలు చేయరని గ్యారంటీ లేదు..? కదా అనే అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ సభలోనే దూషించినా ప్రచారానికి ఎలా వస్తారని తనను తన అభిమానులు ప్రశ్నిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.