సీట్ల సర్దుబాటు: కాంగ్రెసుతో కోదండరామ్ తాడోపేడో...

By pratap reddyFirst Published Oct 21, 2018, 8:04 PM IST
Highlights

. ప్రజా కూటమిలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం జరిగిన పార్టీ సమావేశంలో నేతలందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. 

హైదరాబాద్: ప్రజా కూటమిలో సీట్ల సర్దుబాటు ఇప్పటికీ కొలిక్కి రావడం లేదు. సీట్ల సర్దుబాటుపై తెలంగాణ జన సమితి (టిజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు కాంగ్రెసు ఇస్తామంటున్న సీట్లపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెసుతో తాడోపేడో తేల్చుకోవడానికి తెలంగాణ జన సమితి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

టీజేఎస్ కోర్ కమిటీ నేతలు సమావేశమై ఆ విషయంపై చర్చించారు. కాంగ్రెస్ ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయానికి టీజెఎస్ కోర్ కమిటీ నేతలు వచ్చారు. ప్రజా కూటమిలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి తెలిపారు. 

శనివారం జరిగిన పార్టీ సమావేశంలో నేతలందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. కాంగ్రెస్‌ నుంచి సరైన స్పందన లేకుంటే తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. 

గెలవడానికి అవకాశం లేని చంద్రాయణగుట్ట, మలక్‌పేట లాంటి సీట్లు తమకు ఇస్తారనే వార్తలు వస్తున్నాయని, వీటిని తమ పార్టీ అంగీకరించేది లేదని వెంకట్ రెడ్డి చెప్పారు. తొలుత 36 సీట్లు డిమాండ్ చేశామని, అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ డిమాండ్‌ను 17 స్థానాలకు తగ్గించుకున్నామని చెప్పారు. 

అయినా కాంగ్రెస్ నుంచి సరైన సమాధానం రావటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 8 లేదా 9 సీట్లు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్‌ లీకులిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కో అసెంబ్లీ సీటు తమ పార్టీకి కావాలని వెంకట్ రెడ్డి తెలిపారు. సిద్దిపేటలో హరీష్ రావుతో జనసమితి తలపడటానికి సిద్ధంగా ఉందని చెప్పారు. 

ఇప్పటికీ కూటమిలో ఉండాలనే అనుకుంటున్నామని చెప్పారు. అయితే కాంగ్రెస్ వ్యవహార శైలి తమను ఆలోచింపజేస్తోందని అన్నారు. ఈనెల 24న తెలంగాణ జన సమితి కోర్ కమిటీ సమావేశంలో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

click me!