ఆంధ్ర పాలకుల విధానాలే...: కేసీఆర్ పై కోదండరామ్ నిప్పులు

First Published Apr 29, 2018, 9:46 PM IST
Highlights

 అయితే ఫామ్ హౌస్... లేదంటే ప్రగతిభవన్ ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై మండిపడ్డారు.

హైదరాబాద్: అయితే ఫామ్ హౌస్... లేదంటే ప్రగతిభవన్ ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై మండిపడ్డారు. పార్టీ ఆవిర్భావసభలో ఆదివారం ఆయన కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో అభివృద్ధి మూడు జిల్లాల చుట్టే జరుగుతోందని, అది ఆనందమే అయినా మిగతా జిల్లా సంగతేమిటని ఆయన అన్నారు. అక్కడ కూడా కొంత మందికే ప్రయోజనం కలుగుతోందని, సామాన్యులకు ఉపయోగం ఏమీ లేదని అన్నారు.

ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. లక్ష పోస్టులు ఉన్నాయని చెప్పి కావాలని ఉద్యోగాలను కుదిస్తున్నారని ఆయన అన్నారు. 

మూతపడిన కంపెనీలను తెరిపించడం లేదని అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారని చెప్పారు. చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రైతు బంధం పథకం అందరికీ వర్తించదని ఆయన చెప్పారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వచ విధానాలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రస్తుత పాలకులు ఆంధ్ర పాలకుల విధానాలే ఆనుసరిస్తున్నారని ఆయన ఆయన అన్నారు. ప్రగతి భవన్ లోకి అనుతించరు, సచివాలయానికి రారు అని కేసిఆర్ పై ఆయన వ్యాఖ్యానించారు. 

తమ ఓట్లతో గెలిచి తమనే కాదని పాలిస్తున్న కేసిఆర్ దిగిపోవాలని, కేసిఆర్ ను గద్దె దించడానికి తాము సిద్ధమవుతున్నామని ఆయన అన్నారు. కేసిఆర్ పాలన అంతా అవినీతమయమని ఆరోపించారు. 

కమీషన్ల కోసమే మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టారని కోదండరామ్ అన్నారు. గిరిజనులకు, ఆదివాసులకు మధ్య చిచ్చు పెట్ిట రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆయన విమర్శించారు. 

పాలనలో మార్పు కోసమే పార్టీ పెట్టామని, అదికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని బాగు చేస్తామని అన్నారు. వ్యవసాయ విధానాన్ని రూపొందించి పెట్టుబడి భారం తగ్గిస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. హైదరాబాదు చుట్టూ అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందని అన్నారు. 

click me!