మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

By pratap reddyFirst Published Oct 9, 2018, 11:49 AM IST
Highlights

కూటమికి తెలంగాణ పరిరక్షణ వేదిక అనే పేరును ఖరారు చేశారు. ఈ వేదికకు కోదండరామ్ నేతృత్వం వహించే అవకాశం ఉంది. అయితే, ఆయన తన నిర్ణయాన్ని ఇప్పటి వరకు చెప్పలేదని అంటున్నారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి తరఫున తెలంగాణ జనసమితి (టీజెఎస్) అధినేత కోదండరామ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కూటమికి తెలంగాణ పరిరక్షణ వేదిక అనే పేరును ఖరారు చేశారు. ఈ వేదికకు కోదండరామ్ నేతృత్వం వహించే అవకాశం ఉంది. అయితే, ఆయన తన నిర్ణయాన్ని ఇప్పటి వరకు చెప్పలేదని అంటున్నారు. మహా కూటమి అధికారంలోకి వస్తే సిఎంపి అమలును కూడా ఈ వేదికనే పర్యవేక్షిస్తుంది.

కమిటీ తరఫున ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక (సిఎంపి)ని రూపొందించడంలో కూడా ఆయనదే కీలక భూమిక అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కోదండరామ్ పోటీ చేసే అవకాశాలు కూడా లేవని అంటున్నారు. పోటీ చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని మహా కూటమి విజయానికి కృషి చేస్తారని అంటున్నారు. 

వేదికకు కోదండరామ్ ను చైర్మన్ గా చేసేందుకు కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తోంది. మిగతా భాగస్వామ్య పక్షాలను ఒప్పించే బాధ్యతను కూడా తానే తీసుకుంది.

కాగా, ఇప్పటి వరకు మహా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. టీడీపికి 14, టీజెఎస్ కు 5, సిపిఐకి 3 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెసు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, టీడీపి 20, సిపిఐ 8, టిజెఎస్ 10 స్థానాలను అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు బాధ్యతను కూడా కోదండరామ్ కు అప్పగించాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. 

కాగా,  తెలుగుదేశం పార్టీ ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా అడుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కేసిఆర్ ను గద్దె దించడమే లక్ష్యాన్ని సాధించడానికి మహా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు సర్దుబాటులో ఏదో మేరకు రాజీ పడవచ్చుననే మాట వినిపిస్తోంది.

click me!