సింగూరు నీళ్లు హైదరాబాద్ కెందుకు?: కోదండరామ్ ప్రశ్న

First Published May 23, 2017, 1:16 PM IST
Highlights

సింగూరు జలాలను హైదరాబాద్ కు తరలించడమెందుకు,  జహీరాబాద్ కు కాళేశ్వరం నీళ్లు మళ్లించడమెందుకు అని ప్రొఫెసర్ కోదండరామ్ ప్రశ్నిస్తున్నారు. సింగూరు జలాలను హైదరాబాద్ కు తరలించకుండా స్థానికంగా వినియోగించుకోవాలి. హైదరాబాద్ కు కృష్ణ, గోదావరి నీటిని మాత్రమే వినియోగించుకోవాలని చెబుతున్నారు. సింగూరు జలాల వాడకానికి సంబంధించి ప్రభుత్వం దగ్గిర ఏ ప్రణాళిక లేదని ఆయన  వాదన.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం తరహాలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కాళేశ్వరం ప్రాజక్టు పనులను ఆఫీస్ లో కూర్చుని తనిఖీ చేయించడం మొదలుపెట్టారు. ప్రాజక్టు దగ్గిర ఏర్పాటుచేసిన కెమెరాల సహాయంతో ఆయన పనులెలా సాగుతున్నాయో చూశారు. ఆంధ్రా ముఖ్యమంత్రి  పోలవరాన్ని ప్రతిసోమవారం  రిమోట్ రివ్యూ చేసేందుకు డ్రోన్ లను కూడా  పంపిస్తున్నారు.డ్రోన్ ల కు అమర్చిన కెమెరాలనుంచి నేరుగా పోలవరం చిత్రాలు అమరావతిలోని సిఎం కార్యాలయం లో ఏర్పాటు చేసిన వెండితెర మీద ప్రత్యక్ష మవుతాయి. ఇలా ప్రతిసోమవారం ఆయన పోలవరం రివ్యూచేస్తూ  సోమవారం పేరును పోలవారంగా మర్చేశారు. బహుశా వచ్చే దశలో కెసిఆర్ కూడా  మిత్రుడు చంద్రబాబు బాటలో డ్రోన్ లను పంపి  సమీక్ష జరపవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది.

 

 తెలంగాణా  జెఎసి చెయిర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అసలు తెలంగాణా ప్రభుత్వానికి ఒక నీటి పారుదల నీతి నియమం ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న  సంగారెడ్డిలో మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం లెవనెత్తిన అంశాలు చూస్తే, రాష్ట్రంలో కొన్ని ప్రాజక్టులను నిజంగా నీటి సరఫరా కోసం కడుతున్నారా లేక ఏదో రహస్య అజండా తో కడుతున్నారా అనే అనుమానం వస్తుంది.

 

సంగారెడ్డి, వికారాబాద్,మెదక్  జిల్లాల సాగునీరు, తాగునీరు పై ప్రభుత్వం దృష్టి పెట్టనే లేదని ఆయన విమర్శించారు. సింగూరు నీటిని ఈ ప్రాంత అవరసరాలకు వినియోగించుకొనకుండా హైదరాబాద్ కుతరలించడమేమిటని ఆయన ప్రశ్నించారు. సింగూరు జలాల విషయంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని, వ్యూహం కూడా లేదని విమర్శించారు. సింగూరు నీటిని ఈ ప్రాంత చెరువులలో నింపి నిలువ చేసుకుని ఈ ప్రాంత అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని చెబుతూ, హైదరాబాద్‌కు కృష్ణ, గోదావరి జలాలను మాత్రమే తరలించాలని ఆయన సూచించారు.

 

జహీరాబాద్ నారింజ ప్రాజక్టు పనులు చేపట్టకుండా, ఎక్కడో ఉన్నా కాళేశ్వరం నీటిని జహీరాబాద్ తరలిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించడం పట్ల కోదండరామ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ‘ఉన్న వనరులను  సరిగ్గా ఉపయోగించుకోకుండా ఇతర ప్రాంతాలనుంచి నీటిని తరలిస్తే ఎంత ప్రజాధనం వృధా అవుతుందో ప్రభుత్వం గమనించడం లేదని అన్నారు.కోదండరాం లేవనెత్తిన మరొక విషయం, నిజంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి ప్రభుత్వం ఇంకా శ్రద్ధ చూపకపోవడం. దీనికి నారాయణ్ ఖేడ్ ప్రాంతాన్ని ఉదహరిస్తూ ఈ ప్రాంతాభివృద్ధికి  ప్రత్యేక ప్యాకేజీ ఇంకా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. వలసలు ఈప్రాంతం నుంచే ఎక్కువగా కొనసాగుతూ ఉండటాన్ని ఆయన ప్రత్యేక ప్రస్తావించారు.

 

సమావేశంలో రాష్ట్ర కో-ఛైర్మన్‌ ఆచార్య పురుషోత్తం, జిల్లా ఛైర్మన్‌ వై అశోక్‌ కుమార్‌, కన్వీనర్‌ బీరయ్య యాదవ్‌, నాయకులు ఆకాశవేణి, తుల్జారెడ్డి, మల్లయ్య, అంజద్‌, శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

 

 

click me!