
కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా గిర్ని తండాలో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. అంత్యక్రియలకు ముందు ప్రీతి మృతదేహానికి గిరిజన సంప్రదాయం ప్రకారం సంస్కారాలు నిర్వహించారు. ప్రీతికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రీతి అంత్యక్రియలకు హాజరయ్యారు.
పలువురు రాజకీయ నాయకులు కూడా గిర్ని తండాకు చేరుకుని ప్రీతికి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ప్రతీ అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రీతి అంత్యక్రియల్లో పాల్గొన్న మందకృష్ణ మాదిగ.. ఆమె పాడె మోశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Also Read: మెడికో ప్రీతి కేసు.. హెచ్‌వోడీ నాగార్జునపై తీవ్ర విమర్శలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు..
ఇదిలా ఉంటే.. ప్రీతి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన కూతురును సైఫ్ చంపేశాడని ఆరోపిస్తున్నారు. సైఫ్ ఇంజక్షన్ ఇచ్చి దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన రోజునే ప్రీతి బతకదని అనుకున్నట్టుగా చెప్పారు. అయితే చికిత్స పేరుతో తమను మభ్య పెట్టిందని తెలిపారు. ప్రీతిని వేధింపులకు గురిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ గ్రామంలో డాక్టర్ అయిన మొదటి అమ్మాయి తన కూతురు ప్రీతినేనని చెప్పారు. కానీ చివరకు ఇలా జరుగుతుందని అనుకోలేదని కన్నీటిపర్యంతం అయ్యారు. కేఎంసీలో హెచ్‌వోడీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.
ప్రీతి ఆత్మహత్య చేసుకునేంతా పిరికిది కాదని ఆమె సోదరి చెప్పారు. సీనియర్లు వేధిస్తున్నారని తమతో చెప్పి బాధపడేదని తెలిపారు. ప్రీతికి తమ కుటుంబం పెద్ద సపోర్ట్‌గా ఉందని.. ఆమె ఇలాంటి పిచ్చి పని చేయదని అన్నారు. ప్రీతిని ఎవరో ఏదో చేసి ఉంటారని ఆరోపించారు.