
కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థి ప్రీతి ఐదు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ప్రీతి ఆత్మహత్య యత్నం ఘటన వెలుగుచూసినప్పటీ నుంచి హెచ్‌వోడీ నాగార్జున రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రీతి తల్లిదండ్రులు కూడా నాగార్జున రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు ర్యాగింగ్, వేధింపులకు గురవుతుందని ఫిర్యాదు చేసిన హెచ్‌వోడీ పట్టించుకోలేదని వారు చెబుతున్నారు. హెచ్‌వోడీ నాగార్జున రెడ్డి సీనియర్ విద్యార్థి సైఫ్‌పై చర్యలు తీసుకుని ఉంటే.. ప్రీతికి ఇలా జరిగి ఉండేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌వోడీ నాగార్జున రెడ్డిని సస్పెండ్ చేయాలని ప్రీతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక, ప్రీతి తనపై వేధింపులకు సంబంధించి తండ్రి నరేందర్‌కు చెప్పగా.. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు.. ప్రిన్సిపల్, హెచ్‌వోడీలకు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ వారి నిర్లక్ష్యం వల్లే ప్రీతి చనిపోయిందని ఆమె తండ్రి ఆరోపించారు. సును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్, హెచ్‌వోడీలు పదవిలో ఉంటే తమకు న్యాయం జరగదని అన్నారు.
మరోవైపు ప్రీతి, ఆమె తల్లికి జరిగిన ఫోన్ సంభాషణ కూడా వెలుగులోకి రాగా.. అందులో హెచ్‌వోడీ తీరును ఆమె వివరించారు. ఏదైనా జరిగితే ప్రిన్సిపాల్‌కి ఎందుకు ఫిర్యాదు చేశావని హెచ్‌ఓడీ నాగార్జున రెడ్డి తనను అడిగినట్టుగా ప్రీతి.. ఆమె తల్లితో చెప్పారు. అయితే ఈ క్రమంలోనే సైఫ్‌పై చర్యలు తీసుకోలేదా? అని కూడా ప్రీతి తల్లి అడిగారు. ‘‘సైఫ్ నాతో పాటు చాలా మంది జూనియర్‌లను వేధిస్తున్నాడు. కానీ వారు దానిని బయటకు చెప్పడం లేదు. సైఫ్ వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నేను అతనిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ నన్ను పట్టించుకోరు’’ అని కూడా ప్రీతి తన తల్లికి తెలియజేసింది.
ఇదిలా ఉంటే.. ప్రీతి ఆత్మహత్య యత్నం ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆమెకు మద్దతుగా కేఎంసీ నుంచి విద్యార్థులు ఎవరూ మాట్లాడలేదు. సైఫ్‌కు మద్దతుగా నిరసకు కూడా దిగారు. కనీసం ప్రీతి అంత్యక్రియలకు కూడా కేఎంసీ నుంచి ఆమె క్లాస్‌మెట్స్ గానీ, ఇతరులు గానీ హాజరుకాలేదు. ఈ పరిణామాలు కూడా కేఎంసీలో ఏం జరుగుతుందనే చర్చకు దారితీస్తున్నాయి. హెచ్‌వోడీ తీరుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.