
వరంగల్‌లో కాకతీయ మెడికల్ కాలేజ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి.. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రీతి నిరసనగా ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రీతిని వేధించిన నిందితుడు సైఫ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. అయితే కేఎంసీ వద్దకు భారీగా చేరుకున్న ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే.. ర్యాగింగ్, వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న కేఎంసీ పీజీ మెడికల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల బంద్‌కు ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రీతి మరణానికి కారణమైన నిందితులతో పాటు, సంబంధిత కళాశాల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరింది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఇక, హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టమ్ అనంతరం ఆమె స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకు తరలించారు. ప్రీతి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గిర్ని తండాలో పూర్తిగా విషాదఛాయలు నెలకొన్నాయి. మరికాసేపట్లో ప్రీతి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం ప్రీతి స్వస్థలంలో భారీగా పోలీసులను మోహరించారు.
మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ స్పందించింది. ప్రీతి కుటుంబానికి రూ.30లక్షల ఎక్స్ గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అంతేకాకుండా ప్రీతి మృతిపై విచారణ జరిపించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక, ప్రీతి మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.