‘కైటెక్స్‌’తో నలభై వేల ఉద్యోగాలు వస్తాయన్న కేటీఆర్.. కైటెక్స్ గ్రూప్, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం

By telugu teamFirst Published Sep 18, 2021, 4:23 PM IST
Highlights

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో, రంగారెడ్డిలో ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పారల్ తయారీ క్లస్టర్‌లను స్థాపనపై తెలంగాణ ప్రభుత్వం, కైటెక్స్ గ్రూప్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రానికి రూ. 2400 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 20వేల ప్రత్యక్ష, 22వేల పరోక్ష ఉద్యగాల సృష్టికి మార్గం సుగమమైందని వివరించారు. కైటెక్స్ చైర్మన్ మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత పెట్టబడులను రెండింతలు పెంచామని తెలిపారు.
 

హైదరాబాద్: రాష్ట్రంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో, రంగారెడ్డిలోని సీతారాంపురంలో ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పారల్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌లను కైటెక్స్ గ్రూప్ సిద్ధమవుతున్నది. వీటి కోసం తాజాగా కైటెక్స్ గ్రూప్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అవగాహన ఒప్పంద పత్రాలను ప్రభుత్వాధికారులు, కంపెనీ ప్రతినిధులు మార్చుకున్నారు.

 ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఇతర ఉన్నతాధికారులు, కైటెక్స్ గ్రూప్ చైర్మన్ సాబు జాకబ్, కంపెనీ సీనియర్ ప్రతినిధుల బృందం హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, కేరళ నుంచి పెట్టుబడు ఉపసంహరించుకున్నట్టు తెలియగానే కైటెక్స్ చైర్మన్ జాకబ్‌కు కాల్ చేశారని, రెండు మూడు రోజుల్లోనే ఆయన తెలంగాణకు వచ్చి ఇక్కడి పరిస్థితులను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకున్నారన్నారు. ఒక ఫోన్ కాల్‌తో మొదలై నేడు రూ. 2,400 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు తత్ఫలితంగా 22 వేలు ప్రత్యక్ష, 20 వేలు పరోక్ష ఉద్యోగాల సృష్టి జరుగుతుందని వివరించారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పిల్ల అప్పారల్ తయారీదారుగా ఉన్న కైటెక్స్‌ను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని, వరంగల్, రంగారెడ్డిలలో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన సహాయ సహారాలను ప్రభుత్వంతోపాటు ప్రజాప్రతినిధులు తప్పకుండా అందజేస్తారని తెలిపారు.

తమ కంపెనీ తయారుచేసిన వస్త్రాలను అమెరికాలోని ప్రతి చిన్నపిల్లాడు వేసుకుని ఉంటాడని చెప్పడానికి గర్విస్తున్నామని, ఇకపై తెలంగాణలో తయారైన వస్త్రాలు ధరించిన అమెరికా పిల్లాడు ఉండబోడని అనేది తమ నమ్మకమని కైటెక్స్ చైర్మన్ సాబు జాకబ్ అన్నారు. ఇక్కడ పెట్టుబడుల కన్నా ఉద్యోగ అవకాశాలు కావాలని కేటీఆర్ అడిగారని, ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత వెయ్యి కోట్ల పెట్టుబడులను రూ. 2400 కోట్లకు పెంచామని తెలిపారు.

వరంగల్ జిల్లా గీసుకొండ-సంగెం శివారు, రంగారెడ్డి సీతారాంపురంలో దుస్తుల తయారీ కాంప్లెక్స్ స్థాపించడానికి కైటెక్స్ ముందుకు రావడం శుభపరిణామమని, సంస్థకు మౌలిక సదుపాయాలు సకాలంలో అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి దయాకర్ రావు అన్నారు. తెలంగాణలోని పత్తికి మంచి డిమాండ్ ఉన్నదని, ఈ పత్తితో తయార్యే వస్త్రాలు నాణ్యంగా ఉంటాయని, త్వరగా ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయి, ప్రజలకు ఉపాధి లభించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

click me!