గణేశ్ నిమజ్జనం... 27,000 మంది పోలీసులతో భారీ భద్రత: సీపీ అంజనీ కుమార్

By Siva KodatiFirst Published Sep 18, 2021, 3:53 PM IST
Highlights

హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం సందర్భంగా భద్రతా విధుల కోసం 27000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు చెప్పారు నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్. 320 కిలోమీటర్ల పరిధిలో గణేశ్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి ఎన్టీఆర్ మార్గ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీపీ  తెలిపారు.
 

హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం సందర్భంగా భద్రతా విధుల కోసం 27000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు చెప్పారు నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్. వీరిలో ఎస్పీవో, హోంగార్డ్స్, ఫారెస్ట్, ఎక్సైజ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో పాటు అత్యవసర సమయాల్లో రక్షణకు గాను గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లను రంగంలోకి దింపినట్లు సీపీ చెప్పారు. నగర పోలీస్ విభాగం నుంచి వజ్రా బస్సులు, గ్యాస్, వాటర్ కేనన్లు, క్యూఆర్‌టీ టీమ్‌లను సున్నిత  ప్రాంతాల్లో మోహరించినట్లు తెలిపారు.

దాదాపు ఏడు, ఎనిమిది గణపతి నిమజ్జన వేడుకల విధుల్లో పాల్గొన్న వారికి బాధ్యతలు అప్పగించినట్లు అంజనీ కుమార్ వెల్లడించారు. డీజీపీ కార్యాలయం నుంచి ఈ మేరకు అధికారుల పేర్లతో కూడిన జాబితా వచ్చిందని సీపీ పేర్కొన్నారు. ప్రతి వినాయక విగ్రహానికి బార్ కోడ్ వుంటుందని, దీనితో పాటు 8,147 విగ్రహాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిపారు. అయితే ఇంకా రిజిస్ట్రేషన్ జరుపుకోని విగ్రహాలు కూడా వున్నాయని ఆయన చెప్పారు. 

కాగా, నిమజ్జనం మొత్తం ఆదివారమే పూర్తయ్యేలా ప్రణాళిక అమలు చేయనున్నారు అధికారులు. హుస్సేన్  సాగర్ చుట్టూరా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. అప్పర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, అలాగే నెక్లెస్ రోడ్, బుద్ధ భవన్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 28 భారీ క్రేన్లను అందుబాటులో వుంచారు. అలాగే అడుగుకు మించి వున్న విగ్రహాలను అప్పర్ ట్యాంక్ బండ్ వద్దకు అనుమతించనున్నారు. పది అడుగుల కంటే తక్కువ వున్న విగ్రహాలన్నింటిని ఎన్టీఆర్ మార్గ్ అలాగే నెక్లెస్ రోడ్ వైపు మళ్లించనున్నారు.

320 కిలోమీటర్ల పరిధిలో గణేశ్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి ఎన్టీఆర్ మార్గ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి మూడు నిమిషాలకో మెట్రో రైలును నడుపుతున్నారు అధికారులు. తెలంగాణలో ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్రకు ప్రత్యేక స్థానముంది. భారీ విగ్రహ ఏర్పాటు, శోభాయాత్ర, నిమజ్జనం అంతా సర్వత్రా ఆసక్తి కలిగిస్తాయి. ఈ ఏడాది 40 ఫీట్ల విగ్రహాలను రూపొందించగా.. నిమజ్జన ఏర్పాట్లు ఏ విధంగా వుంటాయన్నది ఉత్కంఠగా మారింది. కోవిడ్ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం శోభాయాత్రకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.
 

click me!