
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అభివృద్ది కోసం ప్రధాని మోదీ వచ్చారని చెప్పారు. మోదీ 8 ఏళ్ల పాలనలో జాతీయ రహదారులు డబుల్ అయ్యాయని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నట్టుగా చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వందే భారత్ ట్రైన్ కూడా ప్రారంభం కాబోతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కనీస మర్యాద పాటించడం లేదని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తే.. సిద్ధాంతాలు పక్కన బెట్టి, రాజకీయ విబేధాలు పక్కన బెట్టి స్వాగతం పలకాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, అధినేత ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తూనే ఉన్నామన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత దౌర్భగ్య పరిస్థితి ఉండదని చెప్పారు.
కేసీఆర్ వైఖరి వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని అన్నారు. మహిళా అని కూడా చూడకుండా గవర్నర్‌ను అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, రైతు సంఘాలను అవమానిస్తున్నరని ఆరోపించారు. తెలంగాణలో పూర్తిగా నియంతృత్వ ప్రభుత్వం ఉందని, తెలంగాణకు ద్రోహం చేసే ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని.. కేసీఆర్‌కు అభివృద్ది పట్టదని విమర్శించారు. అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా.. నిజాం రాజ్యాంగం కావాలని అంటున్నారని మండిపడ్డారు.
గిరిజన వర్సిటీకి భూమి అడిగితే కేసీఆర్ సర్కార్ ఇవ్వడం లేదని విమర్శించారు. సైన్స్ సిటీ కోసం భూమి అడిగితే కూడా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ వస్తే కనీస మర్యాద లేదని ఆరోపించారు. రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టి ఏం సాధించాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. మళ్లీ మళ్లీ ప్రధాని మోదీ తెలంగాణకు వస్తారని అన్నారు. ఒక్క కేసీఆర్ కాదు.. వేల మంది కేసీఆర్‌లు వచ్చినా తమని అడుకోలేరని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి భయపడమని చెప్పారు.