నన్ను తిట్టడం తప్ప వాళ్లకు వేరే పనిలేదు.. ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి: ప్రధాని మోదీ

By Sumanth Kanukula  |  First Published Nov 12, 2022, 2:49 PM IST

ప్రజలకు సేవ చేసే లక్ష్యంతోనే బీజేపీ రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. తెలంగాణ అభివృద్దిలో పాల్గొనడానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 


ప్రజలకు సేవ చేసే లక్ష్యంతోనే బీజేపీ రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. తెలంగాణ అభివృద్దిలో పాల్గొనడానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పేదలకు పంచే రేషన్ బియ్యంలోనూ అక్రమాలు చేశారని అన్నారు. పేదలకు అందాల్సిన నిధుల్లో అవినీతికి తావు  లేకుండా చేవామని చెప్పారు. పీఎం కిసాన్ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నామని చెప్పారు. ఆధార్, మొబైల్, యూపీఐ వంటి సేవలతో అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. నేరుగా ప్రజలకే సంక్షేమ ఫలాలు అందడంతో అవినీతిపరులకు కడుపుమండుతోందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా కొన్నిదుష్టశక్తులు ఏకమయ్యాయని.. అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

ప్రజలకు సేవ చేసే లక్ష్యంతోనే బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. అవినీతి, కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి తొలి శత్రువులని అన్నారు. కరోనా సమయంలో పేదల ఆకలి తీర్చేందుకు రూ. 3 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. తెలంగాణలోనూ రెండు కోట్ల మందికి రేషన్ బియ్యం పంపిణీ చేశామని తెలిపారు. ప్రధాని ఆవాస్ యోజన పథకాన్ని తెలంగాణ సర్కార్ నిర్వీర్యం చేసిందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని రాష్ట్ర సర్కార్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాని ఆవాస్ యోజన పథకం లబ్ది దక్కకుండా చేశారని మండిపడ్డారు. 

Latest Videos

Also Read: తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులు ఉండదు.. ప్రజలను దోచుకునే వారిని వదిలిపెట్టబోం: ప్రధాని మోదీ

మోదీని తిట్టే వాళ్ల గురించి పట్టించుకోవద్దని అన్నారు. వాళ్లకు తనను తిట్టడం తప్ప మరేపనిలేదని విమర్శించారు. 22 ఏళ్లుగా తనను చాలా మంది రకరకాలుగా తిడుతూనే ఉన్నారని అన్నారు. తాను ప్రతిరోజు కిలోల కొద్ది తిట్లు తింటానని.. అందుకే అలసిపోనని చమత్కరించారు. ‘‘నేను అలసిపోలేదా అని కొన్నిసార్లు ప్రజలు నన్ను అడుగుతారు. నిన్న ఉదయం నేను ఢిల్లీలో ఉన్నాను. తరువాత కర్ణాటక, తమిళనాడులో.. సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకనున్నాను. ఇప్పుడు తెలంగాణలో ఉన్నాను. నేను రోజువారీగా పొందే తిట్లు నాకు పోషకాహారంగా పనిచేస్తాయని నేను వారికి చెప్తాను. నేను వాటిని ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగిస్తాను’’ అని మోద అన్నారు. 

తనను, బీజేపీని తిడితే తెలంగాణకు లాభం ఉంటుందంటే తిట్టండి అని చెప్పారు. తనను, బీజేపీని తిట్టినా పట్టించుకోమని.. కానీ తెలంగాణ ప్రజలను తిడితే సహించమని చెప్పారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 
 

click me!