Kishan Reddy: 'కల్వకుంట్ల కుటుంబ ఏటీఎం కాళేశ్వరం'

By Rajesh Karampoori  |  First Published Oct 25, 2023, 11:11 PM IST

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనీ, ప్రాజెక్ట్ భద్రత, మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ నాణ్యతపై అనుమానం బయటపడుతోందని కేంద్ర మంత్రి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. 


Kishan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బ్యారేజ్ నిర్మాణంలో లోపాలపై కేసీఆర్ సర్కార్‌ను విపక్షాలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం నిపుణుల బృందానికి ఆగమేఘాల మీద మేడిగడ్డకు పంపింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు.

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నాణ్యతపై అనుమానం బయటపడుతోందన్నారు. కేసీఆర్ ఓ సూపర్ ఇంజనీర్‌లో అవతారమెత్తి.. నిర్మించిన ఈ ప్రాజెక్ట్ గుదిబండగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు లక్ష్మీ బ్యారేజ్ లైఫ్ లైన్ వంటిదని.. ఇది దెబ్బతింటే మొత్తం వ్యవస్థపైనే ప్రభావం పడుతుందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 

Latest Videos

undefined

తెలంగాణ ప్రజల సంపద దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టారని, ఈ ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఇది ఏటీఎంలా మారిందని, వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి దీనిని నిర్మించారని కిషన్ రెడ్డి సంచలన  వ్యాఖ్యలు చేశారు. బ్యారేజ్ కుంగిపోవడంతో 85 గేట్స్ ఎత్తి 10 టీఎంసీల నీటిని కిందకు వదిలేయాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా అనుకున్న లక్ష్యాలను అందుకోలేదని, ఏటా 400 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని, ఇప్పటివరకు ( నాలుగెండ్లులో) మొత్తం 154 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోస్తారనీ, అందులో కేవలం 104 టీఎంసీల నీటిని మాత్రమే చెరువులు, రిజర్వాయర్లు నింపడానికి ఉపయోగించారని కిషన్ రెడ్డి అన్నారు. 18.27 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ కింద నీళ్లు ఇవ్వాలని లక్ష్యమని.. అయితే కేవలం 56 వేల ఎకరాలు మాత్రమే సాగైందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రజలను మోసగించడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును కట్టారనీ, ప్రాజెక్టులో డొల్లతనం బయటపడిందని అని విమర్శించారు.  

ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజినీరింగ్ నిపుణుల సూచనలను పట్టించుకోకుండా, అధికారుల నోర్లు మూయించి కేసీఆర్ నిర్మాణం చేపట్టారని, ఇది పిచ్చి తుగ్గక్ డిజైన్ అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పనికి రాని చెత్త ప్రాజెక్టు అని, ఈ ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ ఫాం హౌస్ కు మాత్రమే  నీళ్లు అందుతున్నాయి తప్పా.. తెలంగాణ ప్రజానీకానికి నీళ్లు అందడం లేదని విమర్శలు గుప్పించారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చాలా లోపాలున్నాయని, దీని మీద న్యాయ విచారణకు సీఎం సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు సంబంధించి కేసులు పెట్టాలంటే.. ముందు సీఎం కేసీఆర్ మీద పెట్టాలని , ప్రాజెక్ట్ భద్రత, నాణ్యత, డిజైన్ అన్నింటిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. 

గతంలో ఇంజినీర్లు చేసిన అభ్యంతరాలు నేడు నిజమయ్యాయనీ, అందుకే నేడు సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదని అన్నారు. ప్రాజెక్టు భద్రతపై నిపుణులు పరిశీలించి నివేదిక తయారు చేస్తున్నారనీ, వారికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణంలో కుట్ర కోణం దాగి ఉందనీ, దానిని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు  సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 
 

click me!