మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇవాళ భేటీ అయ్యారు. పాలేరు నుండి తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కలేదు.దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం నాడు భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నామా నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయినట్టుగా ప్రచారం సాగుతుంది. గంటకు పైగా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.
ఇవాళ ఉదయం హైద్రాబాద్ లోని తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు భేటీ అయ్యారు. తుమ్మల నాగేశ్వరరావును బుజ్జగించినట్టుగా సమాచారం. అయితే తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్, బీజేపీ నుండి ఆఫర్లు వచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది.ఈ తరుణంలో నామా నాగేశ్వరావు తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నామినేటేడ్ పదవులను కట్టబెట్టేందుకు కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై తుమ్మల నాగేశ్వరరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననేది తేలాల్సి ఉంది.
పాలేరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది. దీంతో తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పాలేరు టిక్కెట్టు తుమ్మల నాగేశ్వరరావుకు దక్కకపోవడంతో ఆయన వర్గీయులు నిన్న సమావేశమయ్యారు. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావును పోటీ చేయాలని కోరుతున్నారు. మరో వైపు బీఆర్ఎస్ ను కూడ వీడాలని తుమ్మల నాగేశ్వరరావుపై ఆయన వర్గీయులు ఒత్తిడి తెస్తున్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఆహ్వానం మేరకు తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన కొద్ది రోజులకే తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. 2018 ఎన్నికల్లో పాలేరు నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ దఫా కూడ పాలేరు నుండి పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్ చేసుకున్నారు. కానీ పార్టీ నాయకత్వం టిక్కెట్టు ఇవ్వలేదు. అసంతృప్తితో ఉన్న తుమ్మల నాగేశ్వరరావును బుజ్జగించేందుకు నామా నాగేశ్వరరావును పార్టీ నాయకత్వం రంగంలోకి దింపిందని ప్రచారం సాగుతుంది. అయితే ఈ చర్చల సారాంశాన్ని నామా నాగేశ్వరరావు పార్టీ చీఫ్ కేసీఆర్ కు చేరవేయనున్నారు.
also read:నాడు టీడీపీ, నేడు బీఆర్ఎస్:పాలేరు చుట్టే తుమ్మల రాజకీయం
పార్టీ నాయకత్వం పంపిన సమాచారంతో తుమ్మల నాగేశ్వరరావు సంతృప్తి చెందుతారా , లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. తుమ్మల నాగేశ్వరరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
10 నియోజకవర్గాల్లో నేతల సమావేశాలు
ఇదిలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు ఆయా నియోజకవర్గాల్లో ఇవాళ సమావేశమయ్యారు. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుండి బయటకు రావాలని తుమ్మల నాగేశ్వరరావును కోరుతున్నారు.