రేకుల షెడ్డుకు రూ. 7 లక్షల కరెంట్ బిల్లు.. లబోదిబోమంటున్న ఇంటి యజమాని

By Mahesh KFirst Published May 19, 2022, 5:11 PM IST
Highlights

ఒక ఫ్యాన్, ఒక టీవీ, రెండు బల్బులు వినియోగిస్తున్న పేద కుటుంబానికి ఏకంగా నెలకు రూ. 7.02 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసి ఆ ఇంటి యజమాని అవాక్కయ్యాడు. కాగా, అది రీడింగ్ మెషీన్ లోపం అని ఓ అధికారి వివరించాడు.
 

హైదరాబాద్: అది రేకుల ఇల్లు. అందులో టీవీ, ఫ్యాన్, రెండు బల్బులకు మాత్రమే కరెంట్ వాడారు. కానీ, కరెంట్ బిల్లు మాత్రం దిమ్మదిరిగేలా వచ్చింది. యూనిట్లు కూడా తక్కువే వచ్చాయి. నెల రోజులకు గాను వారు 117 యూనిట్ల విద్యుత్ వినియోగించినట్టు వచ్చింది. కానీ, బిల్లు మాత్రం 7.02 లక్షలు వచ్చింది. దీంతో ఆ ఇంటి యజమాని షాక్ తిన్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హమాలి కాలనీలో మాడిశెట్టి సంపత్ కుటుంబంతోపాటు నివసిస్తున్నాడు. వారు రేకుల ఇంటిలో నివసిస్తున్నారు. ఆ ఇంటిలో ఒక ఫ్యాన్, ఒక టీవీ, రెండు బల్బులు వాడుతున్నారు. ఆ ఇంటికి ఏకంగా రూ. 7,02,825 బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూడగానే యజమాని సంపత్ మాడిశెట్టి బెంబేలెత్తిపోయాడు.

ఈ బిల్లు తప్పుగా వచ్చిందని తెలుస్తూనే ఉన్నది. అయితే, ఇది సిబ్బంది నిర్లక్ష్యమో లేక సాంకేతిక లోపమో గానీ, ఒక్కసారి ఆ బిల్లు గందరగోళాన్ని సృష్టించింది.

తాము నెల రోజులకు కేవలం 117 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగించామని సంపత్ వివరించింది. ఇంతలా బిల్లు రావడం దారుణం అన్నారు. తాను ఉన్నత అధికారులను కలుస్తానని చెప్పాడు. కాగా, దీనిపై విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్ మాట్లాడారు. ఆ బిల్లు తప్పిదమేనని అంగీకరించారు. సంపత్ ఇంటికి వచ్చిన బిల్లు రూ. 625 మాత్రమేనని వివరణ ఇచ్చారు. రీడింగ్ మెషీన్‌లో లోపం కారణంగా ఇలా అధికంగా బిల్లు వచ్చిందని వివరించారు.

click me!