ఖ‌మ్మం బీఆర్ఎస్ లో ముస‌లం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు రాకుంటే పార్టీని వీడే యోచ‌న‌లో సీనియ‌ర్ నేత‌లు..?

By Mahesh RajamoniFirst Published Jan 2, 2023, 10:45 AM IST
Highlights

Khammam: ఖ‌మ్మం పాటిటిక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అక్క‌డి బీఆర్ఎస్ నేత‌ల పోటాపోటీగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం, త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ వ్యాఖ్య‌లు చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం ఆయా నాయ‌కుల తీరును గ‌మ‌నిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు ద‌క్క‌కుంటే పార్టీ గుడ్ బై చెప్ప‌డానికి సైతం సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చ మొద‌లైంది.

Khammam BRS politics: ఖ‌మ్మం బీఆర్ఎస్ లో క‌ల‌క‌లం మొద‌లైంది. అక్క‌డి నేత‌లు త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డంతో పాటు కొత్త సంవ‌త్స‌రం వేళ త‌మ బ‌ల‌నిరూప‌ణ చ‌ర్య‌ల‌కు దిగ‌డం, నేత‌ల వ్యాఖ్య‌లు రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్ర‌స్తుతం ఆయా నాయ‌కుల తీరును గ‌మ‌నిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు ద‌క్క‌కుంటే పార్టీ గుడ్ బై చెప్ప‌డానికి సైతం సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చ మొద‌లైంది. ఆ నాయ‌కులే ఒకరు మాజీ ఎంపీ, మరొకరు మంత్రి, ఇంకొ­కరు మాజీ మంత్రి. వీరు ముగ్గురూ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ కీల‌క నేత‌లు. ఇటీవ‌ల ఆయా నాయ‌కులు అధిష్ఠానంపై అసంతృప్తిని బ‌హిరంగంగానే వ్యక్తం చేశారు. 

ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, లోక్‌సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్లు రాని పక్షంలో పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇద్దరు నేతలు ఆదివారం బల నిరూపణకు దిగారు. నూతన సంవత్సరం సందర్భంగా తమ తమ నియోజకవర్గాల్లోని తమ మద్దతుదారులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఒకప్పుడు తాను ప్రాతినిథ్యం వహించిన పాలేరు నియోజకవర్గంలో కూడా తుమ్మ‌ల గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నేతలతోపాటు ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అధికార పార్టీ నుంచి వైదొలగే విషయాన్ని ఎవరూ చెప్పనప్పటికీ, పార్టీ ఖమ్మం యూనిట్‌లో పరిస్థితిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పరోక్షంగా సూచనలను వదులుకున్నారు. పార్టీలో తమకు తగిన గుర్తింపు లభించడం లేదని బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై వారు మండిపడుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 

సభను ఉద్దేశించి తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు మాట్లాడుతూ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం జిల్లాను ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. ఎన్టీ రామారావు, ఎన్.చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖరరావు హయాంలో మంత్రిగా పనిచేశాననీ, సాగునీటి ప్రాజెక్టుల అమలులో ముగ్గురు ముఖ్యమంత్రులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఈ క్ర‌మంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వాలని ఆయన మద్దతుదారులు నినాదాలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తామని ప్రతినబూనారు. గత నాలుగు దశాబ్దాల్లో తుమ్మ‌ల జిల్లాలో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ దాదాపు 10 వేల బుక్‌లెట్లను పార్టీ కార్యకర్తలకు పంపిణీ చేశారు.

మరోవైపు, తన రాజకీయ భవిష్యత్తుపై పార్టీ హైకమాండ్ నిర్ణయం కోసం వేచి ఉండాలనీ, సంయమనం పాటించాలని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన మద్దతుదారులను కోరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తనకు టికెట్ నిరాకరించినప్పటి నుంచి బీఆర్‌ఎస్ నాయకత్వం తన పట్ల ఎలా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసునని అన్నారు.  అలాగే, పార్టీలో త‌న‌కు దక్కిన గౌరవం, భవిష్యత్‌లో జరగబోతున్న విష‌యాల‌ను ఒక‌సారి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు త‌న బృందం సిద్ధంగా ఉంద‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. 

మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ సైతం ఇటీవ‌ల ప‌రోక్షంగా త‌న పార్టీ నేత‌ల‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. ఆదివారం ఖమ్మంలో ‘వాడవాడ పువ్వాడ’ పేరిట ప్రత్యేక కార్యక్రమంలో పాలుపంచుకున్న ఆయ‌న‌.. గతంలో తనను దెబ్బకొట్టడం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయని, రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేశారని ఆరోపించారు.

click me!