నేడు ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ నిరసన.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్..

By Sumanth KanukulaFirst Published Jan 2, 2023, 9:37 AM IST
Highlights

హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ల నిధుల సమస్యలపై ధర్నా చేపట్టేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే పోలీసులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. 
 

హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ల నిధుల సమస్యలపై ధర్నా చేపట్టేందుకు సిద్దమైంది. అయితే ఇందుకు సంబంధించి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల అనుమతితో సంబంధం లేకుండా ధర్నా నిర్వహిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేలతను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. తమను అడ్డుకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని  హెచ్చరిస్తున్నారు. 

తాము రాస్తారోకోలకు, అసెంబ్లీ ముట్టడికి అనుమతి కోరలేదని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆదివారం తెలిపారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌ను ప్రజాస్వామిక నిరసనల కోసమే ఏర్పాటు చేశారని.. అనుమతి ఇవ్వడానికి పోలీసులు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఇందిరాపార్కు వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై నిరసన తెలిపేందుకు తాము అనుమతి అడిగామని చెప్పారు. సర్పంచ్​లకు, పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి గ్రామాల అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని అన్నారు. గ్రామాలకు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పెద్ద  ఎత్తున సర్పంచ్‌లు ఇందిరా పార్క్‌ వద్దకు తరలిరావాలని కోరారు. 
 

click me!