
మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. సోమవారం భారీ కాన్వాయ్‌తో షోలాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు.. ఈ రోజు ఉదయం పండరీపూర్‌లోని శ్రీవిట్టల్ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజు నిర్వహించారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ పూజల్లో బీఆర్ఎస్ ముఖ్యనాయకులు కూడా పాల్గొన్నారు. వారిలో బీఆర్‌ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరావు, జోగినపల్లి సంతోష్‌రావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఉన్నారు.
ఇక, పండరీపూర్‌లో ఆలయానికి చేరుకన్న కేసీఆర్‌కు ఆలయ అర్చకులు, నిర్వాహకులు స్వాగతం పలికారు. ఆలయ ఉత్తరద్వారం గుండా కేసీఆర్ లోపలికి వెళ్లారు. ఇక, ఆలయ పరిసరాల్లో నడుచుకుంటూ వెళ్లిన కేసీఆర్‌కు ఓ భక్తుడుకేసీఆర్‌కు శ్రీవిట్టల్ రుక్మణీ ప్రతిమను బహూకరించారు. ఇక, సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మహారాష్ట్రలోని బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ స్థాయిలో పండరీపురం చేరుకున్నారు.
ఆ తర్వాత సీఎం కేసీఆర్ షోలాపూర్ శివార్లలోని సర్కోలి గ్రామానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ షోలాపూర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు భగీరథ్ భాల్కేతో సహా మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్‌లో చేరున్నారు. అక్కడే సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు లంచ్ చేయనున్నారు. ఇక, భగీరథ్ భాల్కే ఆహ్వానం మేరకే సీఎం కేసీఆర్ సర్కోలి గ్రామానికి వెళ్తున్నారు.
అక్కడ పర్యటన ముగించుకున్న అనంతర సీఎం కేసీఆర్ ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్‌లోని భవానీ ఆలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో చేరుకోనున్నారు. కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నాయకులు బాల్క సుమన్, వేణుగోపాలా చారి, మాణిక్ కదమ్ పర్యవేక్షిస్తున్నారు.
కాగా, సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మహారాష్ట్రకు బయలుదేరి వెళ్లారు. ప్రగతి భవన్ నివాసం నుంచి రెండు ప్రత్యేక బస్సులు, దాదాపు 600 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్‌తో ఆయన సాయంత్రానికి షోలాపూర్‌కు చేరుకున్నారు.