
మాజీ మంత్రి, బీజేపీ నేత ఏ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించారని అన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా 60 మంది ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ కూడగట్టారని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్వహించిన ఉద్యమాల ఆకాంక్ష సాధనలో సభలో చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను, కేసీఆర్.. ఒకటేసారి మంత్రులం అయ్యాం. మళ్లీ జరిగిన ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు మంత్రి పదవి రాలేదు.
మంత్రి పదవి ఇవ్వకపోడంతో.. చంద్రబాబుపై కేసీఆర్ యుద్దం ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉండి కూడా.. ఆ రోజు ఉన్న ఎమ్మెల్యేల్లో చీలిక తీసుకురావాలని అనేక ప్రయత్నాలు చేశారు. కేసీఆర్, అప్పుడు మంత్రిగా ఉన్న గోపాలకృష్ణారెడ్డి, నేను, ఇంకొందరు కలిసి చంద్రబాబు నాయుడును దించేయాలి. దించేసి వెంటనే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు. ఒక్కసారి నిజంగా కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా 60 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు.
ఈ 60 మందితోనే ముఖ్యమంత్రి కావాలని ప్లాన్ చేశారు. చంద్రబాబుకు తెలియకుడా గవర్నర్ వద్దకు వెళ్లాలని కేసీఆర్ చెప్పారు. ఈ ప్లాన్ జరిగిన తర్వాత రోజు ముఖ్యమంత్రి తీరుగా కేసీఆర్ కోట్ వేసుకుని మా వద్దకు వచ్చారు. అప్పుడు గోపాలకృష్ణ నువ్వేంది ముఖ్యమంత్రి అయ్యేది అని అన్నారు. ఆ తర్వాత జ్యోతుల నెహ్రు అనే వ్యక్తిని 61వ వ్యక్తిగా పిలిచాం. కానీ జ్యోతుల నెహ్రు కేసీఆర్ ఇంటి నుంచి చంద్రబాబు ఇంటికి వెళ్లి.. జరుగుతున్న విషయం మొత్తం చెప్పాడు. దీంతో చంద్రబాబు అప్రమత్తమై కేసీఆర్ వ్యుహం ఫలించకుండా పోయింది. కేసీఆర్ అధికార దాహంకు ఇది ఒక ఉదాహరణ’’ అని అన్నారు.
దళిత ముఖ్యమంత్రి విషయంలో కూడా కేసీఆర్ అబద్దపు మాటలు చెప్పారని విమర్శించారు. దళితులు పార్టీ వెంట రావడం లేదని దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ ప్రకటన చేశారు. అప్పుడు విజయరామారావు వద్దని చెప్పిన కూడా కేసీఆర్ వినిపించుకోలేదని అన్నారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో చేసిన వాగ్దానాలకు తూట్లు పొడిచారని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి.. ఏమయ్యాయని ప్రశ్నించారు.