సెంటిమెంట్ : కొనాయిపల్లి వెంకన్నను దర్శించుకోనున్న కేసీఆర్.. నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు..

By SumaBala Bukka  |  First Published Nov 4, 2023, 8:15 AM IST

తెలంగాణలో మూడోసారి అధికారం కోసం ఎదురుచూస్తోంది బీఆర్ఎస్. మరి ఈ సారి కేసీఆర్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా? ఆనవాయితీ కలిసొచ్చేనా?


హైదరాబాద్ : పూజలు, యాగాలు, హోమాలను చాలా సెంటిమెంట్ గా భావిస్తారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏ ముఖ్యమైన పని సంకల్పించినా ముందు యాగాలు, పూజలు నిర్వహిస్తుంటారు. ఇక ఎన్నికలకు వెళ్లే సమయంలో అయితే ఈ సెంటిమెంట్ ఇంకా బాగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత మూడు రోజులపాటు ఆయన ఫామ్ హౌస్ లో రాజశ్యామల యాగం జరిగింది. ఈ యాగాన్ని కేసీఆర్ సతీసమేతంగా  నిర్వహించారు. శుక్రవారంతో ఈ యాగం ముగిసింది. ఇప్పుడు మరో సెంటిమెంటుకు తెర లేపారు. 

ప్రతి ఎన్నికల సమయంలోనూ ఓచోట నామినేషన్ పత్రాలకి పూజ చేయించడం కెసిఆర్ కు ఆనవాయితీ. అదే సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కోనాయిపల్లి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం. గత 38 ఏళ్లుగా కెసిఆర్ కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో పూజలు చేస్తున్నారు.  ఇప్పుడూ అదే ఆనవాయితీని కొనసాగించబోతున్నారు. 

Latest Videos

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే...

నామినేషన్ల స్వీకరణ మొదలైన నేపథ్యంలో శనివారం నాడు కెసిఆర్ సిద్దిపేటలో  పర్యటించనున్నారు. ఈ క్రమంలో ముందుగా అక్కడ కోనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకుంటారు. వెంకటేశ్వర స్వామి ముందు నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావు కూడా వెళ్ళనున్నారు. ఆలయంలో పూజల తర్వాత అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు పెట్టనున్నారు.

నామినేషన్ల సమర్పణకు కూడా ఇప్పటికే తేదీని నిర్ణయించుకున్నారు.  సీఎం కేసీఆర్ ఈనెల తొమ్మిదవ తేదీన కామారెడ్డి, గజ్వేల్ లో నామినేషన్లు వేయనున్నారు. శనివారం నాడు ఉదయం 10 గంటలకు కెసిఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా కోనాయిపల్లికి చేరుకుంటారు. వెంకన్న ఆలయాన్ని దర్శించుకుని నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయిస్తారు. 38 ఏళ్ల క్రితం 1985లో కేసీఆర్ మొదటిసారి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ వేశారు. అప్పటినుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. ఆలయం పునర్నిర్మాణం తర్వాత కేసీఆర్ మొదటిసారిగా వస్తున్న నేపథ్యంలో దీనికి కావలసిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

click me!