
తెలంగాణ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎల్లుండి తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు, జడ్పి ఛైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ ఛైర్మన్లకు ఆహ్వానాలు అందాయి. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శ్రేణులను సమాయత్తం చేసేందుకు కేసీఆర్ ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
మరోవైపు.. కవిత దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో పాటు ఈ నెల 10న ఆమె మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు కవిత రెండ్రోజుల ముందే ఢిల్లీకి చేరుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా.. ఈ నెల 10 కవిత దీక్షకు 18 పార్టీలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని సమాచారం. అలాగే సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ . రాజా ముగింపు ఉపన్యాసం చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు భారత జాగృతి ఏర్పాట్లు చేస్తోంది.
ALso REad: రేపు రాలేనని చెప్పి, ఒకరోజు ముందే ఢిల్లీకెందుకు.. వారి సలహా మేరకేనా, కవిత వ్యూహమెంటో..?
అయితే ఈడీ నుంచి నోటీసులు అందిన తర్వాత కవిత ప్రగతి భవన్‌కు వెళ్తారని ప్రచారం జరిగింది. తన తండ్రి, సీఎం కేసీఆర్ సలహా తీసుకుని ఆ విధంగా నడుచుకుంటారని అంతా భావించారు. కానీ చివరికి ఆమె ఢిల్లీకి బయల్దేరారు. అయితే న్యాయ నిపుణుల సలహా మేరకే కవిత ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. విచారణకు ఈడి సమయం ఇవ్వకపోతే హాజరుకావడానికి అందుబాటులో ఉండాలని న్యాయ నిపుణులు సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే కవిత ప్రగతి భవన్‌కు కాకుండా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. మరి రేపు ఢిల్లీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
ఇకపోతే.. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కవితకు ఈడీ నోటీసుల వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం వుంది. ఒకవేళ కవితను ఈడీ అరెస్ట్ చేస్తే ఏం చేయాలన్న దానిపై కేబినెట్‌లో చర్చించే అవకాశాలు వున్నాయని ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐలు దూకుడు చూపిస్తూ వుండటం.. నేరుగా తన కుమార్తెనే టార్గెట్ చేయడంతో కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడ వేస్తారోనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.