యాదాద్రి నిర్మాణంలో రాజీ లేదు.. పని చేయకుంటే వేటే: కాంట్రాక్టర్లకు కేసీఆర్ హెచ్చరిక

By Siva KodatiFirst Published Sep 13, 2020, 7:28 PM IST
Highlights

యాదాద్రిలో వైటీడీఏ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. అంతకుముందు ఆయన అధికారులతో మాట్లాడుతూ... ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి ఆలయ ప్రాంగణం రూపొందించాలని సీఎం ఆదేశించారు

యాదాద్రిలో వైటీడీఏ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. అంతకుముందు ఆయన అధికారులతో మాట్లాడుతూ... ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి ఆలయ ప్రాంగణం రూపొందించాలని సీఎం ఆదేశించారు.

ఎలాంటి తొందరపాటు లేకుండా ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణం చేపట్టాలని.. యదాద్రి ఆలయానికి రింగ్ రోడ్డు ఒక మణిహారంలా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.

ఎంతమంది భక్తులొచ్చినా ఇబ్బంది కలగొద్దని.. ఆలయానికి ఆనుకుని వున్న గండిపేట చెరువును కాళేశ్వరం నీళ్లతో నింపాలని కేసీఆర్ ఆదేశించారు. యాదాద్రి టెంపుల్ సిటీలో 365 క్వార్టర్లు వేగవంతం చేయాలని... మరో 200 ఎకరాల్లో కాటేజీల నిర్మాణం చేపట్టాలని సీఎం కోరారు.

ఇదే సమయంలో సకాలంలో పనిచేయని కాంట్రాక్టర్లను తొలగించాలని.. నిర్మాణ పనుల కోసం 3 వారాల్లో రూ.75 కోట్లు విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

కాగా యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని కేసీఆర్ ఆదివారం దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించేందుకు గాను హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూనే కేసీఆర్ స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో సాగుతున్న పనులను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

click me!