శ్రీశైలం విద్యుత్కేంద్రం ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

By telugu teamFirst Published Aug 21, 2020, 9:46 AM IST
Highlights

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోపల ఇంకా 9 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. 

నాగర్ కర్నూలు: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. 

దట్టంగా పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. లోనికి వెళ్లడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా వీలు కావడం లేదు. లోపల 9 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు తగిన వాతావరణం లేదు.

ఇదిలావుంటే, శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్కేంద్రంలో గురువారం అర్థరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మంటల్లో 9 మంది చిక్కుకున్నట్లు విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. ప్రమాదం జరిగిన ఎడమ గట్టు జలవిద్యుత్కేంద్రం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, తదితరులు అక్కడికి చేరుకున్నారు. 

షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది విధుల్లో ఉన్నారు. జెన్ కో ఆస్పత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. తొలుత నాలుగో యూనిట్ టెర్మినల్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి శబ్దాలొచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తం ఆరు యూనిట్లలో కూడా పొగలు కమ్ముకున్నాయి. కరెంట్ ఉత్పత్రి ఆగిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. చిమ్మచీకటి అలుముకుంది. 

పొగలు రావడాన్ని గుర్తించిన డీఈ పవన్ కుమార్ తో పాటు ఆపరేషన్స్ అండ్ మెయిటెనెన్స్ సిబ్బంది కొందరు వెటనే బయటకు పరుగులు తీశారు. 

మంటల్లో చిక్కుకున్న వారిలో ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు. డీఈ శ్రీనివాస గౌడ్, సుందర్, మోహన్ కుమార్, సుష్మా, ఫాతిమ, వెంకటరావు, ఎట్టి రాంబాబు, కిరణ్ అనే సంస్థ ఉద్యోగులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సిబ్బందిని కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు.

click me!