తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీలో పరిస్థితులు మారుతున్నాయి. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల వేళ పార్టీ అధినేత కేసీఆర్ సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ అంటే కేటీఆర్... కేటీఆర్ అంటే బిఆర్ఎస్ అనేలా పరిస్థితి వుంది. చివరకు పార్టీ అధినేత కేసీఆర్ కంటే కేటీఆర్ పేరే ఈ ఎన్నికల్లో ఎక్కువగా వినిపించింది. కేసీఆర్ కేవలం ఆశీర్వాద సభలతో ప్రచారాన్ని చూసుకున్నారు... మిగతా ఎన్నికల మేనేజ్ మెంట్ అంతా కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడిన నుండి పోలింగ్ ముగిసే వరకు బిఆర్ఎస్ లో అన్నీతానై చూసుకున్నారు కేటీఆర్. అయితే ఇలా కేటీఆర్ నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని చవిచూసి అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
ఒక్క ఓటమితో భారత రాష్ట్ర సమితి పార్టీలో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎన్నికల ముందువరకు కేటీఆర్ ను ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తినవారే ఇప్పుడు ఆయనవల్లే ఓడిపోవాల్సి వచ్చిందని అంటున్నారట. మొత్తంగా కేటీఆర్ నాయకత్వంపై బిఆర్ఎస్ శ్రేణుల్లో మెళ్లిగా వ్యతిరేకత స్వరాలు వినిపిస్తున్నాయట. ఇది మరింత ముదిరితే పార్టీకి నష్టం చేసే అవకాశాలున్నట్లు అధినేత కేసీఆర్ ముందుగానే గ్రహించి మరో మాస్టర్ ప్లాన్ వేసారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల బాధ్యతను తనయుడు కేటీఆర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందువరకు కేసీఆర్ కేంద్ర రాజకీయాలు, కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటారని ప్రచారం జరిగింది. మళ్లీ గెలవగానే కేటీఆర్ ను సీఎం కుర్చీపై కూర్చోబెట్టి తాను కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించారట. కానీ ఇప్పుడు ఇది రివర్స్ అయ్యిందట. కేటీఆర్ నే కేంద్ర రాజకీయాల్లోకి పంపించి మేనల్లుడు హరీష్ రావుతో కలిసి తెలంగాణలో బిఆర్ఎస్ కు పూర్వవైభవం తీసుకువచ్చే ఆలోచనలో కేసీఆర్ వున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే పార్లమెంట్ ఎన్నికల బాధ్యతను కేసీఆర్ తన తనయుడికి అప్పగించారట. మంచి వాక్దాటి కలిగిన కేటీఆర్ ను ఎంపీని చేసి లోక్ సభకు పంపించాలని... తద్వారా జాతీయ స్థాయిలోనూ అతడికి గుర్తింపు కల్పించాలని కేసీఆర్ చూస్తున్నారట.ఇదే సమయంలో హరీష్ ను కూడా సమర్దవంతంగా వాడుకోవాలని కేసీఆర్ చూస్తున్నారట.
Also Read సఫాయి కార్మికులతో సహపంక్తి భోజనం ... కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించిన కేటీఆర్
టీఆర్ఎస్ ఏర్పాటు నుండి బిఆర్ఎస్ గా రూపాంతరం చెందేవరకు కేసీఆర్ తో పాటే హరీష్ రావు ప్రయాణం సాగుతోంది. మేనమామ అడుగుజాడల్లో నడుస్తూ బిఆర్ఎస్ పార్టీని అనేకసార్లు సమస్యల్లోంచి గట్టెక్కించిన ఘనత హరీష్ ది. ఇలా బిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన మేనల్లుడికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ కొనసాగుతున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇలా హరీష్ రావుతో కలిసి బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు కేసీఆర్ భుజానేసుకోవాలని చూస్తున్నారట. తెలంగాణ ఏర్పాటుకు ముందు హరీష్ ఎలాగయితే పార్టీ కోసం పనిచేసారో అలాంటి పరిస్థితులే కల్పించాలన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. కానీ కేటీఆర్ వుండగా అది సాధ్యం కాదు... అందువల్లే ఆయనను జాతీయ రాజీయాల్లోకి పంపించాలని అధినేత అనుకుంటారని సమాచారం. తద్వారా రాష్ట్రంలో హరీష్, దేశంలో కేటీఆర్ ఎవరిపని వారు చేసుకుంటారు... ఇద్దరికీ సమ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా వుంటుందనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఇలా చేస్తే ఇటు హరీష్, అటు కేటీఆర్ మద్దతుదారులు, అభిమానులను కూడా ఒక్కతాటిపైకి తెచ్చినట్లుగా వుంటుందని కేసీఆర్ భాావిస్తున్నట్లుగా తెలుస్తోంది.