టీఆర్ఎస్ అస్తుల విలువ రూ. 300 కోట్లపైనే, ఖర్చు ఇదీ...

By telugu teamFirst Published Jun 22, 2021, 8:27 AM IST
Highlights

కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ఆస్తుల విలువ ఏడాది కాలంలో ద్విగుణీకృతం అయ్యాయి. టీఆర్ఎస్ ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైనే ఉంది. ఖర్చు మాత్రం నామమాత్రంగా ఉంది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆస్తుల విలువ రూ. 300 కోట్లపైనే ఉంది. తమకు రూ.301.47 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు టీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీకి) సమర్పించిన నివేదికలో తెలిపింది. 

తన ఆదాయవ్యయాలకు సంబంధించిన 2019-20 ఆడిట్ నివేదికను టీఆర్ఎస్ సీఈసీకి ఫిబ్రవరి 15వ తేదీన సమర్పించింది. వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆదాయవ్యయాలకు సంబంధించిన వార్షిక నివేదికను సీఈసీ ఇటీవల తన వెబ్ సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. 

2018-19లో రూ.188.73 కోట్లుగా ఉన్న టీఆర్ఎస్ నిధులు, ఆస్తుల విలువ  ఏడాది కాలంలో రూ.301.47 కోట్లకు పెరిగింది. ఇందులో జనరల్ ఫండ్ రూపంలో రూ.292.30 కోట్లు, కార్పస్ ఫండ్ రూపంలో రూ.4.75 కోట్లు, ఇతర రూపాల్లో రూ.4.41 కోట్లు ఉన్నట్లు తెలిపింది. 

పార్టీ పేర ఉన్న భవనాలు, వస్తు సామగ్రి విలు రూ.21.27 కోట్లు ఉంది. ప్రస్తుతం నిర్మాణంలో న్నజిల్లా కార్యాలయాల స్థలం, భూముల విలవ దాదాపు రూ.16.50 కోట్లు ఉంటుంది. 2019-20లో స్థిరాస్తుల కొనుగోలు, షెడ్యూల్ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాలపై వడ్డీ తదితర రూపాల్లో రూ.101 కోట్లు సమకూరాయి.

2019-20 ఆర్థిక సంవత్సరంలో టీఆర్ఎస్ కు వివిధ రూపాల్లో రూ.130.46 కోట్లు సమకూరాయి. ఇందులో విరాళాల రూపంలో అత్యధికంగా రూ.89.55 కోట్లు వచ్చాయి. పార్టీ సభ్యత్వ నమోదు, పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్షం, టీఆర్ఎస్ వీ విభాగాల నుంచి రూ.22.79 కోట్లు సమకూరాయి. బ్యాంకుల్లో సెక్యూరిటీ డిపాజిట్లు, సేవింగ్ ఖాతలపై వడ్డీలు, తదితర రూపాల్లో రూ.18.10 కోట్లు వచ్చాయి. 

ప్రకటనలకు రూ.2.69 కోట్లు, ప్రచారానికి రూ.4.94 కోట్లు కలిపి మొత్తం ఎన్నికల కోసం రూ.7.4 కో్టలు ఖర్చు చేసింది. వాటితో పాటు పార్టీ కార్యాలయాల్లో ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్లు కలుపుకుని ఏడాదిలో రూ.21.18 కోట్లు ఖర్చు చేసింది. 

click me!