24న జగన్, కేసీఆర్‌ల భేటీ: కీలక అంశాలపై చర్చ

By narsimha lodeFirst Published Sep 20, 2019, 7:41 AM IST
Highlights

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్చించనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈనెల 24వ తేదీన మరోసారి భేటీ కానున్నారు.  రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించనున్నారు. 

ఈ సమావేశంలో గోదావరి నది జలాలను కృష్ణా నది పరివాహనికి మళ్లించే విషయమై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.దీంతో పాటు తొమ్మది, పదో షెడ్యూల్ విభజన తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలు మూడు దఫాలు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశాలకు కొనసాగింపుగానే ఈ నెల 24వ తేదీ సమావేశం ఉండనుంది.

గోదావరి నది జలాలను కృష్ణా నదికి మళ్లించే విషయంలో ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆ రాష్ట్ర అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ కూడ కౌంటరిచ్చారు. సముద్రంలో వృధాగా పోతున్న నీటిని రెండు రాష్ట్రాలు వాడుకొనేందుకు వీలుగా ఈ ప్రతిపాదన చేస్తున్నారు.

అయితే ఏ ప్రాంతం నుండి నీటిని మళ్లించాలనే విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన ప్రాంతం నుండి నీటిని మళ్లించే విషయమై చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
 

click me!