
సిఎం కెసిఆర్ తో ఆయన ఫామ్ హౌస్ లో మల్లన్న సాగర్ బాధిత రైతులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు. 410రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న ఆ రైతులకు సిఎం నుంచి పిలుపు రావడంతో తమకు న్యాయం జరుగుతుందని భావించారు. కానీ వారి ఆశలు నెరవేరేలా కనిపించడంలేదు. రెండు రోజుల్లో కలెక్టర్ వచ్చి మీతో మళ్లీ చర్చలు జరుపుతారని సిఎం వారికి చెప్పి పంపించేశారు.
మల్లన్నసాగర్ బాధత గ్రామమైన వేములఘాట్ రైతులు ఇవాల సిఎం కెసిఆర్ ఫామ్ హౌస్ లో చర్చలకు వెళ్లారు. ఈ సందర్భంగా తమకు భూమికి భూమి ఇవ్వాలని సిఎంను రైతులు కోరారు. లేదంటే కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇస్తున్న తరహాలోనే పరిహారం ఇవ్వాలని కోరారు. జిఓ 123 ప్రకారం కాకుండా కేంద్ర భూ నిర్వాసితుల చట్టం ప్రకారం పరిహారం అందించాలని కోరారు.
దీనికి సిఎం స్పందిస్తూ జిఓ 123 ప్రకారం పరిహారం ఇస్తామన్నారు. కొండపోచమ్మ నిర్వాసితులతో సమానంగా పరిహారం ఇవ్వలేమని చెప్పినట్లు తెలిసింది. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని సిఎం వారికి సూచించినట్లు చెబుతున్నారు. భూమి ఉన్నవారికి సబ్సిడీ కింద ట్రాక్టర్ లు అందజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని సిఎం సూచించారు.
అయితే తమకు కేంద్ర చట్టం ప్రకారమే పరిహారం అందించాలని రైతులు కోరినా సిఎం సానుకూలంగా స్పందించలేదని గ్రామస్తులు చెబుతున్నారు. సిఎం స్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో కలెక్టర్ వచ్చినా ఏం లాభమని వారు అంటున్నారు.
మొత్తానికి 400 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న వేములఘాట్ గ్రామస్తుల కష్టాలు ఎప్పటికి తీరుతాయో చూడాలి.