కేసిఆర్ కు తలనొప్పి: 20కి పైగా సీట్లలో తిరుగుబాట్లు

By pratap reddyFirst Published Sep 19, 2018, 12:34 PM IST
Highlights

రాష్ట్రంలోని 105 సీట్లకు ఆయన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిలో 20కి పైగా సీట్లలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. కేటిఆర్ నచ్చజెప్పినా అసమ్మతి నేతలు వినడం లేదు. 

హైదరాబాద్‌: పార్టీలో టికెట్ల చిచ్చు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు తలనొప్పిగా మారింది. రాష్ట్రంలోని 105 సీట్లకు ఆయన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిలో 20కి పైగా సీట్లలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. 

అధికారిక అభ్యర్థులు అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతున్నప్పటికీ అగ్గి చల్లారడం లేదు. తమ మాట వినకపోవడంతో అధికారిక అభ్యర్థులు మంత్రి కేటి రామారావుకు మొరపెట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొంత మంది కేటిఆర్ తో చర్చలకు కూడా రావడం లేదు. మరో వైపు కేటిఆర్ వద్ద రాజీకి వచ్చినట్లే కనిపించి, నియోజకవర్గాలకు వెళ్లిన తర్వాత తిరిగి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం..... శాసనసభ స్పీకర్‌ మధుసూదనచారి భూపాలపల్లిలో అసమ్మతి సెగను  గండ్ర సత్యనారాయణరావు మధుసూదనాచారి కన్నా ముందే ప్రచారంలోకి దిగారు. తనకు టికెట్‌ ఇస్తామని కేటీఆర్, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ హామీ ఇచ్చారని, అందువల్లనే పార్టీలో చేరానని, కానీ తనకు అన్యాయం జరిగిందని గండ్ర అంటున్నారు.

ములుగులో మంత్రి చందులాల్‌ను మార్చాలని ద్వితీయశ్రేణి నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. పోరిక గోవింద్‌ నాయక్, తాటి కృష్ణ, రూప్‌శంకర్‌లలో ఒకరికి టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే టి. రాజయ్యను తప్పించి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి టికెట్‌ ఇవ్వాలని ద్వితీయశ్రేణి ఆందోళనలకు దిగుతున్నారు. 
  
పాలకుర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అధికారిక అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పోటీగా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు తిరుగుబాటు బావుటా ఎగురేశారు. గత కొద్ది రోజులుగా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. 

జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా తీవ్రమైన ఆసమ్మతిని ఎదుర్కుంటున్నారు. ఆయనను మార్చాలని ద్వితీయ శ్రేణి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్‌ అభ్యర్థి శంకర్‌ నాయక్‌ కూడా అదే పరిస్థితిని ఎదుర్కుంటున్నారు.

వేములవాడలో రమేశ్‌బాబును తప్పించాలని కోరుతున్నారు. కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తుల ఉమ ఇక్కడ టికెట్‌ ఆశిస్తున్నారు. రామగుండంలో తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కోరుకంటి చందర్‌ నుంచి వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు.

ఆలేరులో గొంగడి సునీతపై ఓ వర్గం కార్యకర్తలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఖానాపూర్‌లో రేఖానాయక్‌కు  రమేశ్‌ రాథోడ్‌ నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా దుబ్బాక నరసింహారెడ్డి గళమెత్తారు.

మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై తిరుగుబాటు అభ్యర్థిగా వేనేపల్లి వెంకటేశ్వర్‌రావు పోటీకి సిద్ధపడుతున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌పై జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బాలూనాయక్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగేందుకు సిద్ధపడుతున్నారు.

మిర్యాలగూడలో తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు టికెట్‌ లభించింది. అయితే గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి టికెట్ కావాలని పట్టుబడుతున్నారు.  నాగార్జునసాగర్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్య స్థానిక సమస్యను ఎదుర్కుంటున్నారు. స్థానికుడికే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎం.సి. కోటిరెడ్డి, బొల్లెపల్లి శ్రీనివాసరాజు అసమ్మతి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు.
-
ఇబ్రహీంపట్నం సీటులో టీఆర్‌ఎస్‌ అధికారిక అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి పోటీ చేసేందుకు  సిద్ధపడుతున్నారు. రాజేంద్రనగర్‌ సెగ్మెంట్‌లో పార్టీ అదికారిక అభ్యర్థి టి. ప్రకాశ్‌రెడ్డిపై పోటీ చేస్తానని తోకల శ్రీశైలంరెడ్డి అంంటున్నారు.

షాద్‌నగర్‌ అభ్యర్థి అంజయ్య యాదవ్‌కు పోటీగా వి.శంకర్, అందె బాబయ్యలలో ఒకరు పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మక్తల్‌ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కూడా అసమ్మతి ఎదుర్కుంటున్నారు.

పటాన్‌చెరు టికెట్‌ మహిపాల్‌రెడ్డి దక్కింది. అయితే సఫాన్‌దేవ్, కె. బాల్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్‌ టికెట్‌ అశిస్తున్నారు. నారాయణఖేడ్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ రాములు నాయక్‌ టికెట్‌ ఇవ్వాలని అడుగుతున్నారు. ఆందోల్‌ అభ్యర్థి ఖరారుపై నిరసన వ్యక్తం చేస్తూ టీఆర్‌ఎస్‌ ఏకైక జెడ్పీటీసీ సభ్యురాలు మమత బ్రహ్మం పార్టీకి రాజీనామా చేశారు.  

సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవికి పోటీగా గత ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన మట్టా దయానంద్‌ అసమ్మతి రాగం అందుకున్నారు.  వైరా అభ్యర్థి మదన్‌ లాల్‌ కూడా అసమ్మతిని ఎదుర్కుంటున్నారు.

click me!