ఎటు చూసినా ‘ఒకే ఒక్కడు’

First Published Apr 21, 2017, 9:47 AM IST
Highlights

ఎంతో ప్రతిష్టాత్మకంగా, అట్టహాసంగా  ఈరోజు జరుగుతున్న పార్టీ ప్లీనరీలో ప్రచారం మొత్తం కెసిఆర్ తప్ప ఇంకోకరు కనబడటం లేదు. కారణమేమై ఉంటుంది?

టిఆర్ ఎస్ ప్లీనరీలో ఎటు చూసినా కెసిఆరే. రకరకాల భంగిమల్లో పార్టీ అధ్యక్షుడి చిత్రాలు తప్ప మరొక టిఆర్ ఎస్ నాయకుడి చిత్రం ప్లీనరీ ప్రాంగణంలో గాని, వేదిక మీద గాని ఎక్కడ కనిపించదు. చివరకు తెలంగాణా జాతిపిత గా పేరున్న ప్రొఫెసర్ జయశంకర్ చిత్రం కూడా కనిపించదు.  కెసిఆర్ చిత్రానికి అదనంగా కనిపించిది ఒక్క తెలంగాణా తల్లి  మాత్రమే.

నిజాంబాద్ ఎంపి కవిత రెండు రోజుల కింద చెప్పినట్లు, టిఆర్ఎస్ అంటే కెసిఆర్... ఆయన కాకుండా మరొకరు కనుచూపుమేరలో కనిపించరు. కెసిఆర్ కు నెంబర్ టూ లేరు.. టూ, త్రి, ఫోర్, థౌజండ్ కూడా ఆయనే అని ఆమె అన్నమాటలకు రుజువుగా అన్నట్లు ఈ రోజు ప్లీనరీ చిత్రం కనిపిస్తుంది.

సాధారణంగా కార్యక్రమం ప్రభుత్వందైనా లేక పార్టీదైనా సరే మొత్తం కుటుంబసభ్యులందరికీ ప్రచారం రావటం సహజం. అందునా తండ్రి సిఎం, కొడుకు మంత్రి, కూరుతు ఎంపి, మేనల్లుడు మరో మంత్రి అయినపుడు ఇక ప్రచారానికి ఏం కొదవ? మొన్నటి వరకూ జరిగింది కూడా అదే. వీరి నలుగురు మాత్రమే ప్రచారంలో కనబడేవారు. అటువంటిది  ఎంతో ప్రతిష్టాత్మకంగా, అట్టహాసంగా  ఈరోజు జరుగుతున్న పార్టీ ప్లీనరీలో ప్రచారం మొత్తం కెసిఆర్ తప్ప ఇంకోకరు కనబడటం లేదు. కారణమేమై ఉంటుంది?

కారణం కాంగ్రెస్ పార్టీయేనా?

గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలు కొందరు పనిగట్టుకుని మరీ కెటిఆర్-హరీశ్ ల మధ్య పొరపొచ్చాలున్నాయని క్యాంపెయిన్ మొదలుపెట్టారు. పాపం, హరీశ్ అవమానాలు భరిస్తూ కూడా పార్టీలో, ప్రభుత్వంలో కొనసాగుతున్నారంటూ పెద్ద ఎత్తున బోలెడు సానుభూతిని చూపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటనల్లోని నిజం ఎంతో తెలీదుకానీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ మాత్రం  జరుగుతోంది. ఆ విషయం ముఖ్యమంత్రి దృష్టికి రాకుండా ఉంటుందా? అందుకే జాగ్రత్తపడ్డారా. అందులోనూ కెటిఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్లీనరీలో ప్రకటిస్తారంటూ ప్రచారం కూడా జరుగుతోంది.

అదేవిధంగా పార్టీలోని ఎక్కువమంది నేతలు హరీష్ కు మద్దతుగా నిలుస్తున్నట్లు కూడా కాంగ్రెస్సే ప్రచారం చేస్తోంది. కాబట్టి కెటిఆర్ ను ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంగీకరించరని కూడా ప్రచారం చేస్తోంది. ఇటువంటి నేపధ్యంలో జరుగుతున్న ప్లీనరీ కాబట్టి కెసిఆర్ ముందు జాగ్రత్తపడ్డారని అనిపిస్తోంది.

ఎందుకొచ్చిన గొడవ అన్న పద్దతిలో కూతురు కవితతో ‘పార్టీలో కెసిఆర్ తప్ప ఇంకో నాయకుడే లేడ’ని కూడాఅని అనిపించింది కూడా దీనికోసమేనా.

కెటిఆర్, కవితల ఫొటోలు వాడితే హరీశ్ రావు ఫొటోలు లేవన్న అనుమానాలు ప్రశ్న వస్తుంది. కాంగ్రెస్ దానికి పెడార్థం తీస్తుంది. వివాదం రాజుకుంటుంది కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి ఊతమిచ్చినట్లవుతుంది. అందుకనే కెసిఆర్ ఆదేశాలు ఇచ్చారా అన్నట్లుగా ఎక్కడా రెండో ఫొటో లేకుండానే ప్లీనరీ జరిగిపోతోంది.

click me!