కేసీఆర్ రెడీ: తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఇదే?

By pratap reddyFirst Published Aug 26, 2018, 8:34 PM IST
Highlights

తెలంగాణ శాసనసభ రద్దకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మంత్రులు మాట్లాడుతున్న తీరు ఈ విషయాన్ని తెలియజేస్తోంది. 

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ రద్దకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మంత్రులు మాట్లాడుతున్న తీరు ఈ విషయాన్ని తెలియజేస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన ఏకాదశి రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అసెంబ్లీని రద్దు చేస్తారని వార్తలు వస్తున్నాయి. 
 
పంచాంగాన్ని, గ్రహబలాన్ని, తారాబలాన్ని కేసీఆర్ విశ్వసిస్తారు. దాంతో జాతకరీత్యా, రాజకీయ రీత్యా అన్ని లెక్కలూ సరిచూసుకుని ఆయన ఈ ముహూర్తం నిర్ణయించినట్లు  చెబుతున్నారు. 

శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, రాష్ట్ర కమిటీ సంయుక్త సమావేశంలో మాట్లాడిన కేసీఆర్‌ మరో 10-12 రోజుల తర్వాత కలుద్దామని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు చెప్పారు.

కేసీఆర్ ఢిల్లీ పర్యటన కూడా ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారానికి ఊతమిస్తున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇటీవల ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 

అందువల్ల త్వరలో జరగబోయే మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగవచ్చుననే ప్రచారం ఊపందకుంది.

click me!