
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు(సోమవారం) అసెంబ్లీ(Assemby)లో బడ్జెట్(Telangana Budget 2022) ప్రవేశపెట్టింది. రూ. 2.56 లక్షల కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు(Finance Minister Harish Rao) ప్రవేశపెట్టారు. కేసీఆర్ (KCR) ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో సాగు(Agriculture)పై మరో కీలక వ్యూహాన్ని ప్రకటించింది. గతంలో వరి పంట కొనుగోళ్లపై రాష్ట్రం వర్సెస్ కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించారు. నిరసనలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక సాగు నీటి పారుదల సదుపాయాలు మెరుగయ్యాయని, పంట దిగుబడి కూడా అమాంతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కష్టపడి పండించిన పంటను కొనడానికి కేంద్రం ప్రభుత్వానికి చేతకావడం లేదని మండిపడ్డారు. కేంద్రం వరి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేసి నిరసనల బాట పట్టగా.. రాష్ట్రంలోని బీజేపీ కూడా ఆందోళనలు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా బడ్జెట్‌లో కేసీఆర్ ప్రభుత్వం సాగుపై మరో వ్యూహాన్ని రచించింది.
వరి వేస్తే ఉరేనని, కేంద్రం తెలంగాణ ప్రజలు పండించిన పంటను కొనుగోలు చేయడం లేదని గతంలో చెప్పిన కేసీఆర్ ఈ సారి బడ్జెట్ రూపంలో పామాయిల్ పంటకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పించారు. ఈ దెబ్బతో రాష్ట్రంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వంతోనూ వైరికి బ్రేక్ పడినట్టయింది. సాగు విషయమై బీజేపీ నేతలు కేసీఆర్‌పై విమర్శలు చేయకుండా గట్టి కౌంటర్ ఇచ్చినట్టు అయింది.
రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ఈ రోజు అసెంబ్లీలో తన బడ్జెట్ ప్రసంగంలో పామాయిల్ పంట గురించి నొక్కి చెప్పారు. దేశంలో పామాయిల్‌కు డిమాండ్ చాలా ఎక్కువ ఉన్నదని వివరించారు. భారత దేశం రూ. 80 వేల కోట్ల పామాయిల్‌ను ప్రతియేటా దిగుమతి చేసుకుంటున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు సాగు నీటి వసతులు పెరిగిన తర్వాత పామాయిల్ పంట వేయడానికి ఇక్కడి వాతావరణం ఎంతో అణువుగా మారిందని చెప్పారు. పామాయిల్ సాగు చేయడం కూడా చాలా సులభతరం అని పేర్కొన్నారు. చీడపీడల బాధ ఉండదని, కోతులు, అడవి పందుల బెడద కూడా ఈ పంటకు ఉందని అన్నారు. ఇప్పటికే పామాయిల్ పంట వేస్తున్న రైతన్నలు మంచి లాభాలు ఆర్జిస్తున్నారని చెప్పారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పామాయిల్ పంట సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని వివరించారు. అంతేకాదు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల ఎకరాల్లో రూ. 1000 కోట్ల పెట్టుబడులతో ఆయిల్ పామ్ సాగు చేయాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిందని తెలిపారు. ఇంతటి మహాశయాన్ని పెట్టుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని అన్నారు. అందుకే రాష్ట్ర రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున ఆయిల్ పామ్‌ను సాగు చేయాలని ప్రభుత్వం కోరుతున్నదని వివరించారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం వరి పంటకు బదులు ఇతర వాణిజ్య పంటలకు మొగ్గు చూపాలని రైతులను కోరారు. ఉదాహరణకు యాసంగి సీజన్‌లో శెనగలు, వేరు శెనగలు, పెసలు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు, ఆముదాలు సహా ఇతర కూరగాయల వంటి పంటలు పండించి లాభాలు పొందవచ్చునని సూచనలు చేశారు.