లాలూకు సీఎం కేసీఆర్ ఫోన్.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలన్న తేజస్వి యాదవ్..

By Sumanth KanukulaFirst Published Jan 11, 2022, 8:34 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (tejashwi yadav)  భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు వీరి సమావేశం సాగింది. ఈ భేటీ సందర్భంగా కేసీఆర్.. లాలూ ప్రసాద్ యాదవ్‌తో (Lalu Prasad Yadav) ఫోన్‌లో మాట్లాడారు.
 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (tejashwi yadav)  భేటీ ముగిసింది. ఈ బేటీ ఆర్జేడీ నుంచి మాజీ మంత్రి అబ్దుల్ బారి సిద్దిఖీ, ఎమ్మల్సీ సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే బోలా యాదవ్ పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు వీరి సమావేశం సాగింది. ఈ భేటీలో జాతీయ రాజకీయాలకు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయి. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని ఇరువురు నేతలు వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు బీజపీ వ్యతిరేకమని.. ఆ పార్టీని గద్దె దింపేవరకు పోరాడాల్సిన అవసరం ఉందని.. ఇందుకు త్వరలో భవిష్యత్తు కార్యచరణ నిర్ణయించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే జాతీయ రాజకీయాలను బలోపేతం చేసేందకు.. కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించాలని తేజస్వి యాదవ్ కోరారు. 

లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేసీఆర్ ఫోన్..
ఈ భేటీ సందర్భంగా కేసీఆర్.. లాలూ ప్రసాద్ యాదవ్‌తో (Lalu Prasad Yadav) ఫోన్‌లో మాట్లాడారు. లాలూ ఆరోగ్య సమాచారం గురించి అడిగి తెలుసుకన్నారు. బీజేపీని గద్దె దింపే వరకు పోరాడాల్సిన అవసరముందని కేసీఆర్ లాలూతో అన్నారు. బీజేపీ ముక్తభారత్ కావాల్సిందేనని.. లౌకిక వాద, ప్రజస్వామ్య శక్తులు ఏకతాటిపైకి రావాల్సి ఉందని చెప్పారు.  బీజేపీ అరాచక పాలన నుంచి దేశాన్ని రక్షించాలని అన్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చిందన్న విషయాన్ని లాలూ గుర్తుచేశారు.  దేశంలో లౌకిక, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలని.. అందుకు కేసీఆర్ ముందుకు రావాలని లాలూ ప్రసాద్ యాదవ్ కోరినట్టుగా సమాచారం. 

కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించాలి.. 
ఈ భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలను బలోపేతం చేయాలని, అందు కోసం సాగే భాజపా వ్యతిరేక పోరాటంలో కలిసి ముందుకు వెళ్తామని ఆర్జేడీ నేతలు చెప్పినట్లు తెలిసింది. అందుకు సీఎం కేసీఆర్ ప్రధానపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని తేజస్వి యాదవ్ అన్నారు. లౌకికవాద, ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు... తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తేజస్వీ యాదవ్ బృందం స్పష్టం చేసినట్లు తెలిసింది.

మరోవైపు యూపీలో అఖిలేష్ యాదవ్‌కు శరద్‌ పవార్ మద్దతు గొప్ప మలుపు అని తేజస్వి యాదవ్ కేసీఆర్‌తో అన్నారు. యూపీలో బీజేపీ మంత్రి సమాజ్‌వాద్ పార్టీలో చేరారని.. ఇది బీజేపీ పతనానికి నాంది అని వ్యాఖ్యానించారు. 

click me!