కేసీఆర్ మరో చండీయాగం చేస్తాడట

First Published Feb 24, 2017, 12:09 PM IST
Highlights

కాంగ్రెస్ లో కోమటి రెడ్డి బ్రదర్స్ తీరే వేరు. పార్టీ లోని వారితోనే పోరుసలపడం వారి ప్రత్యేకత.

అవును... సీఎం కేసీఆర్ మరోసారి చండీయాగం చేస్తాడట. అయితే ఈ విషయం టీఆర్ఎస్ కే కాదు కేసీఆర్ కు కూడా తెలియదు.

 

కానీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లోని కోమటిరెడ్డి బ్రదర్స్ కు మాత్రమే తెలుసు. వారే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

కాంగ్రెస్ లో కోమటి రెడ్డి బ్రదర్స్ తీరే వేరు. పార్టీ లోని వారితోనే పోరుసలపడం వారి ప్రత్యేకత.

 

మొన్నామధ్య కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ చేసిన సర్వేపై విరుచపడ్డారు. తాను త్వరలోనే పీసీసీ అధ్యక్షుడు అవుతానని ప్రకటించారు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు సీఎం అవడం గ్యారెంటీ అని జోస్యం చెప్పారు.

ఈ రోజు ఆయన సోదరుడు వంతు వచ్చినట్లు ఉంది. ఆయన తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు. సీఎం కేసీఆర్‌కు తామంటే భయం పట్టుకుందని తమకు పీసీసీ అధ్యక్ష పదవి రాకుండా ఉండేందుకు కేసీఆర్‌ మరో చండీయాగం చేసేందుకు సిద్ధం అవుతున్నారని చెప్పారు కోమటి రెడ్డి బ్రదర్స్ లో ఒకరైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

 

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో ఆయన తన సోదరుడు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి పలు కార్యక్రమాలల్లో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ కొత్త యాగాల గురించి చెప్పుకొచ్చారు. ప్రజలంతా కోమటిరెడ్డి బ్రదర్స్ కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు.  తాము పాదయాత్ర చేస్తే  2019లో కాంగ్రెస్‌ వంద సీట్లు గెలుచుకొని అధికారం దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

 

2014 లో కూడా ఈ బ్రదర్స్ ఇంతే ధీమాతో మాట్లాడారు. కానీ, ఫలితం వేరుగా వచ్చింది. కనీసం పీసీసీ పీఠం కూడా దక్కలేదు. అదే జిల్లాకు చెందిన ఆయన సామాజిక వర్గం నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి దక్కింది.

 

పీసీసీ రథసారథిగా ఉత్తమ్.. అధికార పార్టీపై పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయనతో కలవాల్సిన ఈ నేతలిద్దరూ ఆయనపైనే పోరాటం చేస్తుంటే ఇంకా కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చిందే... కోమటి రెడ్డి బ్రదర్స్ కల ఎప్పటికి నెరవేరేది అని పార్టీ కార్యకర్తలే చెవులుకొరుక్కుంటున్నారు.

 

click me!