కెసిఆర్ పిలుపు కర్ణాటకలో కాంగ్రెసును దెబ్బ తీసిందా?

First Published May 15, 2018, 10:55 AM IST
Highlights

దేవెగౌడ నేతృత్వంలోని జెడిఎస్ కు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కె. చంద్రశేఖర రావు బహిరంగంగా మద్దతు ప్రకటించడం కర్ణాటకలో కాంగ్రెసును దెబ్బ తీసినట్లు భావిస్తున్నారు.

హైదరాబాద్: దేవెగౌడ నేతృత్వంలోని జెడిఎస్ కు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కె. చంద్రశేఖర రావు బహిరంగంగా మద్దతు ప్రకటించడం కర్ణాటకలో కాంగ్రెసును దెబ్బ తీసినట్లు భావిస్తున్నారు. ఊహించిన దానికన్నా కాంగ్రెసుకు తక్కువ సీట్లు రావడం, జెడిఎస్ కు ఎక్కువ సీట్లు రావడం దాని ఫలితమేనని అంటున్నారు.

జెడిఎస్ కు కేసిఆర్ మద్దతు ప్రకటించడం పరోక్షంగా బిజెపికి కలిసి వచ్చిందని అంటున్నారు. కేసిఆర్ జెడిఎస్ కు మద్దతు ప్రకటించడాన్ని తెలంగాణ కాంగ్రెసు నాయకులు కూడా తప్పు పట్టారు. తమ పార్టీని దెబ్బ తీసి, బిజెపికి ప్రయోజనం చేకూర్చడానికే కేసిఆర్ బెంగళూరు పర్యటన పెట్టుకున్నారని అప్పట్లో వారన్నారు.

తెలంగాణ కాంగ్రెసు నాయకుల మాటే నిజమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కర్ణాటకలోని తెలుగువాళ్లు కాంగ్రెసుకు కాకుండా జెడిఎస్ కు ఓటు వేయడం వల్లనే బిజెపి గెలిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తమ రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీని ఓడించాలని ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు కూడా బిజెపికే ఉపయోగపడినట్లు చెబుతున్నారు. బిజెపికి వ్యతిరేకంగా తెలుగు ప్రజలు ఓటు వేయడానికి సిద్ధపడిన తరుణంలో వారు కాంగ్రెసు వైపు కాకుండా జెడిఎస్ వైపు మొగ్గు చూపినట్లు భావిస్తున్నారు. 

హంగ్ వస్తుందనే అంచనాను తలకిందులు చేస్తూ బిజెపికి సాధారణ మెజారిటీని కర్ణాటక ఓటర్లు కట్టబెట్టడం వెనుక తెలుగు ఓటర్ల పాత్ర కీలకంగా మారిందని అంటున్నారు. బిజెపి మెజారిటీ వ్యూహం కూడా పనిచేసిందని అంచనా వేస్తున్నారు.

click me!