
హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కర్ణాటకలో హస్తం పార్టీ విజయంతో పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో.. కర్ణాటకలో పార్టీ విజయం ప్రభావం ఇక్కడ ఉంటుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్రంలో పార్టీకి బలం పెరుగుతుందని నమ్ముతున్నారు.
ఈ తరుణంలో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఇందుకు ముహుర్తం కూడా సిద్దం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్న పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. మరోవైపు జూపల్లి కృష్ణారావు కూడా కొల్లాపూర్‌తో ఉమ్మడి మహబూబ్ నగర్‌లోని తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారిద్దరు కూడా సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు అధికార బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో.. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఆ తర్వాత ఇరువురు నేతలకు కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆఫర్లు వెళ్లాయి. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలు జూపల్లి, పొంగుటేటితో టచ్‌లో ఉన్నారు. అయితే ఏ పార్టీలో చేరే అంశంపై ఇరువురు నేతలు క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి ఒకే పార్టీలకు వెళతారా? చెరో దారి చూసుకుంటారా? కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.
Also Read: బీజేపీ-టీడీపీ-జనసేనల పొత్తు ఉంటుందా?.. పవన్ ప్రతిపాదనపై బీజేపీ ఎంపీ జీవీఎల్ రియాక్షన్ ఇదే..
మాజీ ఎంపీ పొంగులేటిని బీజేపీలోకి చేర్చుకుంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమ పార్టీని విస్తరించవచ్చని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే పొంగులేటికి గేట్స్ ఓపెన్‌లో పెట్టింది. ఇటీవల బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తో పాటు మరికొందరు బీజేపీ నేతలు.. ఖమ్మం వెళ్లి పొంగులేటి, జూపల్లిలతో సమావేశం అయ్యారు. అయితే ఆ సమావేశం అనంతరం ఇరువురు నేతలు కూడా బీజేపీలో చేరికపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకు సమయం కోరినట్టుగా తెలుస్తోంది.
అయితే తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో ఇరువురు నేతలు కూడా.. హస్తం గూటికి చేరేందుకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం సాగుతుంది. అయితే వారి వారి అనుచరులలో కొందరు బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపుతుండగా.. మరికొందరు మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మంచి అవకాశాలు ఉన్నాయనే భావనతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సమాచారం. మరోవైపు కొత్త పార్టీ ఏర్పాటును కూడా కొందరు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అయితే తాము ఏ పార్టీలో చేరే అంశంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరువురు నేతలు చెబుతున్నారు. తమ మద్దతుదారుల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తున్నారు. అయితే తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం జూన్ 2వ తేదీ లోపే వీరు ఈ విషయంలో క్లారిటీ ఇస్తారని వారి సన్నిహితులు చెబుతున్నారు. పొంగులేటి, జూపల్లి ఇద్దరు ప్రస్తుతం ఒకే మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీస్థానిక పరిస్థితుల ఆధారంగా వారి నిర్ణయాలు ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరువురు నేతలు కూడా కాంగ్రెస్ వైపు అడుగులు వేసేందుకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం సాగుతుంది.